Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపులు.. రెండు గంటల్లో 8ఫోన్‌ కాల్స్‌!

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ఆయన కుటుంబాన్ని బెదిరించిన కేసులో....

Published : 15 Aug 2022 21:19 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ఆయన కుటుంబాన్ని బెదిరించిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో విష్ణు భౌమిక్‌ (56 ఏళ్లు) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అఫ్జల్‌ పేరుతో ఫోన్‌ చేసి బెదిరించిన ఆ వ్యక్తిని ముంబయికి చెందిన నగల వ్యాపారిగా గుర్తించినట్టు సమాచారం. రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రిలో ఈరోజు స్వాతంత్ర్య వేడుకలు పూర్తయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి తప్పుడు గుర్తింపుతో ఫోన్‌ చేసి బెదిరింపులకు గురిచేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉదయం 10.30గంటల సమయం నుంచి అతడు ఎనిమిది ఫోన్‌ కాల్స్‌ చేశాడని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన డీబీ మార్గ్‌ పోలీసులు కాల్‌ చేసిన వ్యక్తి లొకేషన్‌ను ట్రేస్‌ చేశారు. అతడు ఫోన్‌ చేసినప్పుడు ధీరూభాయి అంబానీ పేరును కూడా వాడినట్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముంబయిలోని దహిసార్‌ ప్రాంతానికి చెందిన భౌమిక్‌కు క్రిమినల్‌ కేసులు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అతడిపై ఐపీసీ 506(2) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కొన్ని కేంద్ర ఏజెన్సీలు కూడా సమాచారం కోరినట్టు పోలీసులు వెల్లడించారు. 

గతేడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts