Monkeypox: మంకీపాక్స్‌ టీకా తయారీకి ఎనిమిది ఫార్మా సంస్థల ఆసక్తి!

దేశంలో మంకీపాక్స్‌ వ్యాప్తిని అరికట్టేందుకు టీకా తయారీ, వ్యాధి నిర్ధారణ కిట్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా.. మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది........

Published : 13 Aug 2022 22:00 IST

దిల్లీ: దేశంలో మంకీపాక్స్‌ (monkeypox) వ్యాప్తిని అరికట్టేందుకు టీకా తయారీ, వ్యాధి నిర్ధారణ కిట్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఆహ్వానానికి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ రూపొందించేందుకు ఎనిమిది ఫార్మా సంస్థలు ఆసక్తిని చూపాయని, భారత వైద్య పరిశోధన మండలి(ICMR)లో బిడ్లు దాఖలు చేసినట్లు అనధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటితోపాటు ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కోసం ఇన్-విట్రో డయాగ్నోస్టిక్ (IVD) కిట్ల తయారీకి 23 టెండర్లు వచ్చినట్లు తెలిపాయి. మొత్తంగా 31 కంపెనీలు ముందుకు వచ్చినట్లు వెల్లడించాయి.

దేశంలో మంకీపాక్స్‌ కేసుల కట్టడికి టీకాలు, నిర్ధారణ కిట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గత నెల 27న టెండర్లను ఆహ్వానించింది. అనుభవం కలిగిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఆగస్టు 10వ తేదీలోగా తమ ఆసక్తిని వ్యక్తీకరించాలని వెల్లడించింది. మంకీపాక్స్‌ టీకాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకోసం వ్యాధి నిర్ధారణ కిట్లు, నివారణ టీకాల అభివృద్ధికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేస్తామని తెలిపింది.

దిల్లీలో మరో కేసు

దేశంలో మంకీపాక్స్‌ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా దిల్లీలో ఉంటున్న 22 ఏళ్ల ఆఫ్రికన్‌ మహిళకు మంకీపాక్స్‌గా నిర్ధరణ అయ్యింది. వ్యాధి లక్షణాలతో ఆ మహిళ ప్రముఖ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో రెండ్రోజుల క్రితం చేరగా.. పరీక్షల్లో తాజాగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. నెల రోజుల క్రితమే ఆమె నైజీరియాకు వెళ్లి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో దిల్లీలో కేసుల సంఖ్య ఐదుకు చేరగా.. దేశవ్యాప్తంగా కేసులు 10కి పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని