Omicron: దేశంలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొత్తగా మహారాష్ట్రలో మరో ఎనిమిది మందిలో ఈ కొత్త వేరియంట్‌.......

Published : 17 Dec 2021 21:19 IST

ముంబయి: దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొత్తగా మహారాష్ట్రలో మరో ఎనిమిది మందిలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగుచూడగా.. కేరళలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 40కి చేరినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా బయటపడిన వారిలో ఆరుగురు పుణెకు చెందిన వారు కాగా.. ఒకరు ముంబయి, మరొకరు కల్యాణ్‌ డోంబివలీకి చెందినవారిగా అధికారులు గుర్తించారు. వీరంతా 29 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన పురుషులేనని తెలిపారు. యూఏఈ నుంచి కోచికి వచ్చిన ఇద్దరు వృద్ధ దంపతుల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. వీరిలో ఒకరి వయస్సు 68 ఏళ్లు కాగా.. మరొకరి వయస్సు 67. వీరిద్దరూ స్వీయనిర్బంధంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా మహారాష్ట్ర, కేరళలో వచ్చిన వాటితో కలిపితే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 111కి పెరిగింది.

దేశంలో కేసులు ఇలా..

మహారాష్ట్రలో  40 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. దిల్లీలో 22, రాజస్థాన్‌ 17, కర్ణాటక 8, తెలంగాణ 8, కేరళ 7, గుజరాత్‌ 5, ఏపీ, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కటిచొప్పున నమోదయ్యాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో పాటు మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, జనం రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, అనవసర ప్రయాణాలను మానుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని