Omicron: తమిళనాడులో 80-85% కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే..!

తమిళనాడులో ఒమిక్రాన్‌ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రోజూవారీగా నమోదవుతున్న కేసుల్లో 80-85 శాతం కేసులు ఈ వేరియంట్‌వే ఉండొచ్చని......

Published : 09 Jan 2022 23:40 IST

చెన్నై: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో ఈ వేరియంట్‌ మరింత విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రోజూవారీగా నమోదవుతున్న కేసుల్లో 80-85 శాతం కేసులు ఒమిక్రాన్‌వే ఉండొచ్చని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్‌ తెలిపారు. మిగతా 15-20 శాతం డెల్టా రకంగా ఉండే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కొత్త వేరియంట్‌తో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తమను తాము రక్షించుకునేందుకు టీకాలు తీసుకోవాలని కోరారు.

ఒమిక్రాన్‌ సోకినవారిలో 90 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని, వారిలో ఎలాంటి లక్షణాలు లేవని మంత్రి వెల్లడించారు. కొత్త వేరియంట్‌ సోకి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరూ మృతిచెందకపోవడం సానుకూలాంశమన్నారు. ‘ప్రతిఒక్కరు టీకా రెండు డోసులు తీసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది’ అని సుబ్రహ్మణ్యన్‌ పేర్కొన్నారు.

ఆదివారాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌

కొవిడ్‌ వ్యాప్తి కట్టడికి తమిళనాడు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు చేపడతామని వెల్లడించింది. నిత్యావసర దుకాణాలు, వైద్య సదుపాయాలు నిత్యం అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రెస్టారెంట్లలో ‘టేక్‌ అవే’కు మాత్రమే అనుమతినిచ్చింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 9443 మందికి కొవిడ్‌ సోకింది. దీంతో అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 40,260కు చేరింది. వైరస్‌తో 10 మంది మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని