India: 80% పల్లెలు వైద్యానికి దూరం

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటూ ప్రభుత్వాలు ఘనంగా చెబుతున్నా గ్రామాల్లో అది ప్రతిబింబించడంలేదు.

Updated : 22 May 2021 10:19 IST

మిషన్‌ అంత్యోదయ సర్వేలో వెల్లడి 

ఈనాడు, దిల్లీ:  పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటూ ప్రభుత్వాలు ఘనంగా చెబుతున్నా గ్రామాల్లో అది ప్రతిబింబించడంలేదు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన మిషన్‌ అంత్యోదయ సర్వే-2019ని పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతోంది. దాదాపు 80%కిపైగా గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేవని తేలింది. 6% గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 14.5% గ్రామాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు, 23.5% గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు, 11.5% గ్రామాల్లో మాత్రమే జన ఔషధీ కేంద్రాలు ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న 2,66,430 పల్లెల్లో సర్వే చేసిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భూసారపరీక్ష కేంద్రాలు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ డిగ్రీకాలేజీలు, వృత్తి విద్యా కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ కేంద్రాలు కేవలం 10%లోపు పల్లెలకు మాత్రమే పరిమితమయ్యాయి. గ్రామాల్లో అత్యధికంగా ఉన్న సౌకర్యం అంగన్‌వాడీ కేంద్రాలే. మొబైల్‌ ఫోన్‌ సౌకర్యం, ఇంటర్‌నెట్‌/బ్రాడ్‌బ్యాండ్, పోస్టాఫీసులు, పంచాయతీభవనాలు, రహదారి అనుసంధానం బాగానే ఉన్నట్లు తేలింది. 
*మరోవైపు వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన గ్రామీణ వైద్య నివేదిక ప్రకారమూ పల్లెల్లో ఉన్న ఆసుపత్రుల్లోనూ సరైన వైద్యసిబ్బంది లేరు. డాక్టర్ల నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్లవరకు  80వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అందులో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని