Corona: మహారాష్ట్రలో 81శాతం పెరిగిన కేసులు.. ఓ మహిళకు బీఏ.5 వేరియంట్‌!

సోమవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా కేసులు 81శాతం పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక రాజధానిలో మంగళవారం 1881 కేసులు నమోదయ్యాయి......

Published : 07 Jun 2022 23:56 IST

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నట్లే కనబడుతోంది. రోజురోజుకు కొవిడ్‌ కేసులు అధికమవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 81శాతం పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక రాజధానిలో మంగళవారం 1881 కేసులు నమోదయ్యాయి. గత ఫిబ్రవరి 18 తర్వాత నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. వీటిల్లో 1,242 కేసులు రాజధాని ముంబయి నుంచే ఉన్నాయి. కానీ మరణాలు నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. సోమవారం, రాష్ట్రంలో 1,036 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇందులో ముంబై వాసులు 676 మంది ఉన్నారు. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తంగా వైరస్‌ సోకినవారి సంఖ్య 78,96,114కు చేరగా.. మృతుల సంఖ్య 1,47,866కు చేరింది.

ఇదిలా ఉంటే.. పుణెకు చెందిన ఓ మహిళలో ఒమిక్రాన్‌ ఉపవేరియంట్‌ బీఏ.5ను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. ‘బాధితురాలికి ఎలాంటి లక్షణాలు లేవు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతోంది’ అని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్ల కేసులను మే 28న మొదటిసారి గుర్తించారు. నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు వైద్యులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని