students Positive: ఉత్తరాఖండ్‌లో 85 మంది విద్యార్థులకు పాజిటివ్‌

నైనిటాల్‌లోని గంగార్‌కోట్‌లో గల జవహర్‌ నవోదయ విద్యాలయలో 85 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డిప్యూటీ కలెక్టర్‌ రాహుల్‌ సాహ్‌ తెలిపారు.పాఠశాల...

Published : 02 Jan 2022 16:34 IST

నైనితాల్‌ (ఉత్తరాఖండ్‌): నైనిటాల్‌లోని గంగార్‌కోట్‌లో గల జవహర్‌ నవోదయ విద్యాలయలో 85 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డిప్యూటీ కలెక్టర్‌ రాహుల్‌ సాహ్‌ తెలిపారు.పాఠశాల సిబ్బంది, విద్యార్థులు 11 మందికి తొలుత పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ ఆరోగ్యశాఖ కోవిడ్‌ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి 496 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 85 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలిందని వివరించారు.నవోదయ విద్యాలయలో కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్‌ సూచన మేరకు పాఠశాలను మైక్రో కంటైన్‌మెంట్‌జోన్‌గా మార్చినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులను పాఠశాలలోనే ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి తిరిగి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష నిర్వహించిన పిదప మాత్రమే డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌లో శనివారం నాలుగు కొత్త ఒమిక్రాన్‌ కేసులు నమోదుకాగా, మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లోనూ విద్యార్థుల కార్యక్రమాలు రద్దు

పశ్చిమ బెంగాల్‌లోనూ కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే పాఠశాలలు మూసివేతపై అధికారులు నిర్ణయం తీసుకోవాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ఈ క్రమంలో ఈనెల 1నుంచి 7వరకు కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో జరగాల్సిన విద్యార్థుల వారోత్సవాల కార్యక్రమాలు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయించారు.పశ్చిమ బెంగాల్‌లో తాజాగా 4,512 కొత్త కేసులు నమోదయ్యాయి.13,300 మంది కోవిడ్‌ సోకి చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలో 20 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కోవిడ్‌ కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది.

ప్రభావాన్ని బట్టి పాఠశాలల మూత

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ముంబై, కోల్‌కతా, దిల్లీ, చెన్నై వంటి నగరాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్‌ చివరి వారం నుంచి కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో మరోసారి పరిస్థితిని బట్టి పాఠశాలలు మూసివేయాలని కొన్ని రాష్ట్రాలు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. తమిళనాట పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈనెల 10వరకు 1-8తరగతుల విద్యార్థులకు సెలవు ప్రకటించి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావాలని సూచించారు.తమిళనాడు, హర్యానా, దిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో మరోసారి నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు