PM Cares: దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్‌ ప్లాంట్లు

సెకండ్‌ వేవ్‌ వంటి పరిస్థితులను అధిగమించేందుకు పీఎం కేర్స్‌ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది

Updated : 29 Feb 2024 18:42 IST

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పీఎం కేర్స్‌ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. అంతేకాకుండా కరోనా పోరులో భాగంగా రానున్న రోజుల్లో అవసరమైన సమయంలో ‘ఫ్లయింగ్‌ హాస్పిటల్స్‌’ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది.

‘సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న వేళ కొవిడ్‌ బాధితుల కోసం చాలా నగరాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. వీటిని ఫ్లయింగ్‌ హాస్పిటల్స్‌గా పిలుస్తున్నాం. ఒకవేళ కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే.. ఇలాంటి ఆసుపత్రులను మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తాం’’ అని డీఆర్‌డీవో చీఫ్‌ సతీశ్‌ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరులో భాగంగా పీఎం కేర్స్‌ నిధులను ఉపయోగించి దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇవే కాకుండా రక్షణశాఖకు అవసరమైన అత్యంత ఆధునిక సాంకేతికతను అందించడంతోపాటు సామాన్యుల ప్రయోజనం కోసం తక్కువ ధరలో అధిక నాణ్యత కలిగిన సాంకేతికతపైనా దృష్టి సారించామని డీఆర్‌డీఓ చీఫ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని