Antibodies: అక్కడ 86 శాతం మందిలో యాంటీబాడీలు!

బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ చేపట్టిన 5వ సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.....

Published : 17 Sep 2021 22:15 IST

ముంబయి: బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ చేపట్టిన 5వ సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ముంబయిలోని 86 శాతం మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గ్రేటర్‌ ముంబయిలోని 24 వార్డులకు చెందిన 18 ఏళ్లకు పైబడిన 8,674 మంది నమూనాలు సేకరించి ఈ పరీక్షలు జరిపారు. ఇందులో ఒకటి లేదా రెండు టీకా డోసులు తీసుకున్న వారిలో ఏకంగా 90.26 శాతం యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. వ్యాక్సిన్‌ తీసుకోనివారిలో 79.86 శాతం యాంటీబాడీలు ఉన్నాయి. గత ఆగస్టులో నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా.. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. కొవిడ్‌ మూడో దశ రానున్న నేపథ్యంలో ప్రజల్లో యాంటీబాడీలు ఉండటం ఊరట కలిగించే అంశం.

సీరో సర్వేలోని ప్రధానాంశాలు:

* ఈ సర్వే కోసం 65శాతం మంది టీకా తీసుకున్నవారి నుంచి నమూనాలు సేకరించగా.. ఇంకా టీకా పొందని 35 శాతం మంది నుంచి కూడా సేకరించారు. 

* ముంబయి మహా నగరంలో యాంటీబాడీలు ఉన్నవారు 86.64శాతం. ఇందులో 87.02 శాతం మురికివాడల్లో నివసించేవారు కాగా.. 86.22శాతం ఇతర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.

* పురుషుల కంటే మహిళల్లోనే యాంటీబాడీలు ఎక్కువ ఉండటం గమనార్హం. పురుషుల్లో 85.07 శాతం మందిలో యాంటీబాడీలు ఉండగా.. 88.29 శాతం మహిళల్లో ఉన్నట్లు తేలింది.

* వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 90.26 శాతం మందికి యాంటీబాడీలు ఉండగా, తీసుకోనివారిలో 79.86 శాతం మందిలో ఉన్నాయి.

గతంలో జరిపిన సీరో సర్వేతో పోలిస్తే.. ప్రస్తుతం ప్రజల్లో యాంటీబాడీలు గణనీయంగా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధకాలు కూడా అధికంగా ఉన్నట్లు తేలింది. యాంటీబాడీలు ఉన్నప్పటికీ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది. టీకాలు తీసుకోనివారంతా త్వరితగతిన తీసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని