SpiceJet: 737 మ్యాక్స్‌ విమానాలను ఆ పైలట్లు నడపకూడదు..

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు చెందిన 90 మంది పైలట్లు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను నడపకూడదని ఆదేశించింది. వారికి ఈ విమానాలను నడపడంలో సరైన శిక్షణ లేనట్లు డీజీసీఏ గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకొంది.

Updated : 13 Apr 2022 10:55 IST

 90 మంది స్పైస్‌జెట్‌ పైలట్లపై డీజీసీఏ ఆంక్షలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు చెందిన 90 మంది పైలట్లు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను నడపకూడదని  డీజీసీఏ ఆదేశించింది. వారికి ఈ విమానాలను నడపడంలో సరైన శిక్షణ లేనట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకొంది. ‘‘ఇప్పటికైతే ఆ  పైలట్లు మ్యాక్స్‌ విమానాలు నడపకుండా ఆదేశాలు జారీచేశాం. వారు మరోసారి పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత విమానాలను నడపవచ్చు. లోపాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం’’ అని డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో ఈ పైలట్లు మ్యాక్స్‌ సిమ్యూలేటర్‌పై మరోసారి శిక్షణ తీసుకోవాల్సి ఉంది.

డీజీసీఏ నిర్ణయాన్ని స్పైస్‌జెట్‌ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ‘‘స్పైస్‌ జెట్‌ వద్ద 737మ్యాక్స్‌ను నడిపేందుకు 650 మంది పైలట్లు శిక్షణ పొందారు. 90 మంది పైలట్ల శిక్షణ ప్రొఫైల్‌ను పరిశీలించిన డీజీసీఏ వారు మ్యాక్స్‌ విమానాలు నడపకుండా నిషేధం విధించింది. దీంతో ఈ పైలట్లు మరోసారి శిక్షణకు వెళ్లి డీజీసీఏ ప్రమాణాలను అందుకోవాల్సి ఉంది. ఈ పైలట్లు బోయింగ్‌ 737 విమానాలు నడిపేందుకు మాత్రం అందుబాటులో ఉంటారు’’ అని వెల్లడించారు. 

2019లో ఇథియోపియాలో 737మ్యాక్స్‌ విమానం ప్రమాదానికి గురికావడంతో అదే ఏడాది మార్చి 13న భారత్‌ ఈ విమానాలపై నిషేధం విధించింది. బోయింగ్‌ సంస్థ ఈ విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడంతో  గతేడాది ఆగస్టులో వీటిపై నిషేధాన్ని తొలగించారు. 27నెలల వ్యవధిలో పైలట్లు మ్యాక్స్‌ సిమ్యూలేటర్లపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలని నిబంధన విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని