Vaccination: 142 కోట్ల కొవిషీల్డ్.. 23 కోట్ల కొవాగ్జిన్‌ పంపిణీ

ఫిబ్రవరి 3 నాటికి దేశంలో 142 కోట్ల కొవిషీల్డ్, 23 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 08 Feb 2022 22:31 IST

89కోట్ల మందికి తొలిడోసు ఇచ్చామన్న కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏయే వ్యాక్సిన్‌లు ఎంతెంత మొత్తంలో అందజేశారనే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 3 నాటికి దేశంలో 142 కోట్ల కొవిషీల్డ్, 23 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. వీటితోపాటు మరో 12లక్షల స్పుత్నిక్‌ డోసులను కూడా అందించినట్లు తెలిపింది.

89కోట్ల మందికి తొలిడోసు..

ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వీ, జైకోవ్‌-డీ అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీన్‌ పవార్‌ రాజ్యసభలో వెల్లడించారు. దేశంలో 18ఏళ్ల వయసు పైబడిన అర్హుల్లో 89.73కోట్ల (95.6శాతం) మందికి తొలిడోసు అందించగా, 71.80కోట్ల (76.5శాతం) మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ ఇచ్చామని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇక దేశంలో రెండు వ్యాక్సిన్‌లు విస్తృతంగా వినియోగంలో ఉండగా.. వాటిలో కొవిషీల్డ్‌ సామర్థ్యం 79.99శాతం, కొవాగ్జిన్‌ సామర్థ్యం 77.8శాతం ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచామన్న ఆమె, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ల కొరత లేదని స్పష్టం చేశారు.

ఇక రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం, 2021-22 నాటికి దేశంలో 15 నుంచి 18ఏళ్ల మధ్య వయసు జనాభా 7.4కోట్ల అని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఈ వయసు వారికి ఈ ఏడాది జనవరి 3 నుంచే వ్యాక్సిన్‌ అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని పార్లమెంటుకు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇదిలాఉంటే, ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 170కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ రోజువారీ బులిటెన్‌లో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని