Corona: వారిలో 96 శాతం మంది బాధితులు ఆక్సిజన్ పడకలపైనే..!

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, మిజోరం వంటి రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Updated : 19 Oct 2022 11:32 IST

దిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, మిజోరం..తదితర రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ రాష్ట్రాల్లో మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దీని తీవ్రత కనిపిస్తోందని పేర్కొన్నాయి. మరోపక్క టీకా తీసుకోని వారిలోనే కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. 

టీకా తీసుకోనివారికే ఆక్సిజన్ అవసరం..

మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా ఒమిక్రాన్ కేసులున్నాయి. అలాగే అక్కడ కొత్త కేసులు 40 వేల పైనే ఉన్నాయి. ముంబయిలో ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల దిశగా యోచనచేస్తోంది. ‘రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్ 700 మెట్రిక్ టన్నులు, పడకల సామర్థ్యం 40 శాతం దాటితే.. మేం లాక్‌డౌన్ గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం పడకల సామర్థ్యం 15 శాతం లోపునే ఉంది. ఆక్సిజన్ డిమాండ్ కూడా చాలా తక్కువగా ఉంది’ అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు. అలాగే ముంబయి నగరంలో రాత్రి పగలు తేడా లేకుండా కార్యకలాపాలు జరుగుతుంటాయని, రాత్రి పూట అత్యవసరం కాని ప్రజల సంచారాన్ని కట్టడి చేయాల్సి ఉందన్నారు. అందుకోసం రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు విధించాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా.. బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ ఆందోళన కలిగించే విషయం ఒకటి వెల్లడించారు. ముంబయిలోని వివిధ ఆసుపత్రుల్లో 1900 మంది బాధితులు ఆక్సిజన్ పడకలపై ఉన్నారని, వారిలో 96 శాతం మంది కనీసం టీకా మొదటి డోసు కూడా తీసుకోలేదని వెల్లడించారు. తమ దగ్గర 21 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే అర్హులైన వయోజనులందరికీ టీకా వేసేందుకు రెండు డోసుల మధ్య వ్యవధి అడ్డంకిగా ఉందని తెలిపారు. అయినా సరే వ్యాక్సినేషన్‌ పరంగా మెరుగ్గా ఉన్నామన్నారు. 

బెంగాల్‌ కొవిడ్ కేసుల్లో 60 శాతం కొత్త వేరియంటే..!

పశ్చిమ్ బెంగాల్‌లో కరోనావిజృంభణకు 60 శాతం ఒమిక్రాన్ కారణమని తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్త కేసులు 18 వేలకుపైనే నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు 27కి చేరాయి. అన్ని కొవిడ్ పాజిటివ్‌ నమూనాలను పరీక్షించకపోవడంతో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందని నిపుణులు అంటున్నారు. 

దిల్లీలో 20 వేల కేసులు..!

దేశ రాజధాని దిల్లీలో 20 వేల కొత్త కేసులు నమోదుకానున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. పాజిటివిటీ రేటు 19 శాతానికి చేరనుంది. రెండో వేవ్‌తో పోల్చుకుంటే ఈ సారి ఆసుపత్రుల్లో చేరిక తక్కువగా ఉందని, వ్యాధి తీవ్రత కూడా స్వల్పంగానే ఉందని తెలిపారు. అక్కడి మెజార్టీ కేసులకు ఒమిక్రాన్ కారణమని జీనోమ్ సీక్సెన్సింగ్ వివరాలను బట్టి  వెల్లడవుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు మూడు వేలకుపైనే ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని