US: 99 శాతం కరోనా మరణాలు వారిలోనే..!

కొంతకాలంగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న కొవిడ్ బాధితుల్లో 99శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారేనని అమెరికాలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు.

Published : 05 Jul 2021 01:06 IST

కొవిడ్‌ మరణాలు నివారించేవే అంటున్న అమెరికా నిపుణులు

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొవిడ్‌ మరణాలు మాత్రం సంభవిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది. అయినప్పటికీ కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న కొవిడ్ బాధితుల్లో 99 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారేనని అమెరికాలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఇవన్నీ నివారించగలిగేవేనని స్పష్టం చేశారు.

‘కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్న బాధితుల్లో 99 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఉన్నారు. ఇవన్నీ నిర్మూలించగలిగేవే. మహమ్మారిని ఎదుర్కొనే అత్యంత సమర్థమైన సాధనం మన చేతుల్లో ఉన్నప్పటికీ.. దానిని అందరూ తీసుకోకపోవడం విచారకరం’ అని ఆంటోని ఫౌచీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కోసం ఏదైనా చేసేందుకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో అదృష్టవశాత్తు అమెరికా ప్రజలకు సరిపోయేంత వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం మనందరి శత్రువు కరోనా వైరస్‌ అని.. అందుకే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తప్పనిసరి తీసుకోవాలని అమెరికా ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్‌ల పట్ల కొందరిలో వ్యతిరేక భావన ఉందని.. దానిని పక్కనబెట్టాలని ఆంటోని ఫౌచీ స్పష్టం చేశారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటి వరకు 6లక్షల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని