అలా ఐతేనే భారత్‌లోకి విదేశీ వ్యాక్సిన్లు

విదేశీ కరోనా వ్యాక్సిన్లను భద్రతా పరీక్షల అనంతరం మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

Published : 05 Oct 2020 17:06 IST

దిల్లీ: విదేశీ కరోనా వ్యాక్సిన్లను భద్రతా పరీక్షల అనంతరం మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. భారతదేశం వెలుపల తయారయ్యే కొవిడ్‌-19 వ్యాక్సిన్లను దేశంలో ప్రవేశపెట్టేందుకు ఇక్కడ అదనపు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ స్పష్టం చేశారు. భారతీయుల విషయంలో ఆయా వ్యాక్సిన్ల భద్రత, రోగనిరోధకతను నిర్ధారించే బ్రిడ్జింగ్‌ అధ్యయనాలు సంతృప్తికరంగా ఉంటేనే వాటికి అనుమతి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

‘‘వివిధ కరోనా వైరస్‌ వ్యాక్సిన్లను దేశంలో ప్రవేశపెట్టే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే విదేశాల్లో జరిగిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సురక్షితం, ప్రభావవంతం, రోగ నిరోధానికి తోడ్పడేవిగా నిర్ధారణ అయిన వ్యాక్సిన్లు కూడా భారత ప్రజలకు సరిపడేవిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.’’ అని హర్షవర్ధన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకోసం చిన్నపాటి, త్వరగా పూర్తయ్యే నమూనా అధ్యయనాలను చేపడతామని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా పలు సంస్థలు కొవిడ్ వ్యాక్సిన్‌ తయారీలో చివరి అంకంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కోవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు చేపట్టిన కొవాగ్జిన్‌‌, జైడస్‌ క్యాడిలాకు చెందిన జైకోవ్‌-డి వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా రష్యాకు చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీకి సంబంధించి మూడో దశ ప్రయోగాలను భారత్‌లో చేపట్టే విషయమై.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి హర్ష వర్ధన్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని