తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా: ఆడ్వాణీ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ పేర్కొన్నారు.

Updated : 30 Sep 2020 14:29 IST

దిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని, నేడు మనందరికీ సంతోషకరమైన రోజు అని ఆడ్వాణీ అన్నారు. రామజన్మభూమి పట్ల తన వ్యక్తిగత, పార్టీ నిబద్ధతను తాజా తీర్పు నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తమను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆడ్వాణీ ఈ విధంగా స్పందించారు.

న్యాయమే గెలిచింది: మురళీ మనోహర్‌ జోషి

బాబ్రీ మసీదు కేసులో తమ ప్రమేయం లేదంటూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి స్వాగతించారు. ఆలస్యమైనప్పటికీ కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. దీనిలో చివరకు న్యాయమే గెలిచిందన్నారు. మా ఉద్యమం సామాన్యులతో కూడినదని, దీనిలో ఎలాంటి కుట్ర లేదన్న విషయం తాజా తీర్పు ద్వారా నిరూపితమైందని ఆయన స్పష్టంచేశారు.

సత్యమే గెలుస్తుందని మరోసారి నిరూపితం: రాజ్‌నాథ్‌ సింగ్‌

సత్యమే ఎప్పటికీ గెలుస్తుందని బాబ్రీ కేసు తీర్పుతో మరోసారి నిరూపితమైనట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రమంత్రులతోపాటు పలువురు భాజపా నేతలు ఈ తీర్పుపై సంతోషం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే, బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు దిల్లీలో అలెర్ట్‌ ప్రకటించారు. ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సత్యమే మళ్లీ గెలిచింది: చౌహాన్‌
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. మళ్లీ సత్యమే గెలిచిందన్నారు. సత్యం కాస్త ఇబ్బందుల్లో పడింది కానీ ఓడిపోలేదని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. భారతీయ న్యాయవ్యవస్థను అభినందిస్తున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని