మనిషిని జూలో పెట్టి.. 114 ఏళ్ల తర్వాత క్షమాపణ

మనిషిని జంతు ప్రదర్శన శాలలో ప్రదర్శనకు ఉంచినందుకు 114 ఏళ్ల అనంతరం డబ్ల్యుసీసీ బహరంగంగా క్షమాపణలు చెప్పింది.

Updated : 14 Dec 2022 10:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒటా బెంగా అనే ఆఫ్రికా జాతి వ్యక్తిని ఒకప్పుడు జూలో మృగాలతో పాటు ప్రదర్శించారనేది నమ్మశక్యం కానిదే అయినా, నిజం. ఒక మనిషిని జంతు ప్రదర్శన శాలలో ప్రదర్శనకు ఉంచినందుకు 114 ఏళ్ల అనంతరం అమెరికాకు చెందిన వైల్డ్‌లైఫ్‌ కన్సర్వేషన్‌ సొసైటీ (డబ్ల్యుసీసీ) ఇటీవల బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. మే 25న అమెరికా పోలీసుల దౌర్జన్యం వల్ల జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు మృతి చెందిన ఘటనతో.. ప్రపంచ వ్యాప్తంగా వర్ణవివక్షపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ చర్యతో.. వర్ణవివక్ష లేని ప్రపంచం దిశగా మరో అడుగు పడినట్టే అని పలువురు భావిస్తున్నారు.

ఒటా బెంగా ఎవరు?

ఒటా బెంగా ఆఫ్రికాలో ఉండే బుటీ తెగకు చెందిన పిగ్మీ. ఇతన్ని 1904లో కాంగో నుంచి కిడ్నాప్‌ చేశారు. 1906లో సామ్యూల్‌ ఫిలిప్స్‌ వెర్నర్‌ అనే అమెరికన్‌ వ్యక్తి, తన ‘జంతు ప్రదర్శన శాల’ కోసం ఇతన్ని కొన్నాడు. ఇరవై ఏళ్లు కూడా లేని బెంగాను బ్రాంక్స్‌ జూలో చింపాంజీలు, కోతులు ఉండే ప్రదేశంలో ఉంచారు. అనంతరం ఈ చర్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఎట్టకేలకు విడుదలైన బెంగా... బ్రూక్లిన్‌లోని ఓ శరణాలయంలో ఆశ్రయం పొందాడు.

ఇంటికి వెళ్లాలి..

ఆ శరణాలయ సంరక్షకుడు అతనికి సాధారణ దుస్తులు ఏర్పాటు చేశాడు. తన తెగ ఆచారం ప్రకారం పదునుగా చేసుకున్న అతని దంతాలు సరిచేసుకునేందుకు సహకరించాడు. నాటి సమాజంలో ఒకడిగా మారటానికి  బెంగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇంగ్లీషు నేర్చుకుని... స్థానికంగా ఉన్న ఓ పొగాకు ఫ్యాక్టరీలో పనిచేశాడు. మిగిలిన జీవిత కాలమంతా అమెరికాలోనే గడిపిన బెంగా.. ఒకే ఒకసారి తన స్వదేశానికి వెళ్లగలిగాడు. తిరిగి వెళ్లిపోయేందుకు ఎంతో ప్రయత్నించినా... ప్రపంచ యుద్ధం కారణంగా వీలుకాలేదు. దీనితో మానసికంగా కుంగిపోయిన ఈ ఆఫ్రికన్‌ యువకుడు 1916లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడిగా అమెరికాకు వచ్చిన బెంగా జీవితం ఈ విధంగా ముగిసిపోవటం విచారకరం.

ఇది జరిగి శతాబ్దం పైగా గడిచిన అనంతరం, డబ్ల్యూసీసీ అధినేత క్రిస్టియన్‌ సాంపర్‌.. తమ యాజమాన్యంలో ఉన్న బ్రాంక్స్‌ జూలోని మంకీ హౌస్‌లో కొన్నాళ్ల పాటు ఒటా బెంగాను ఉంచినందుకు క్షమాపణ కోరాడు. ‘‘ఈ చర్యకు పాల్పడినందుకు, ఇప్పటి వరకూ దీనిని బహిరంగంగా ఖండించటం, నిరసించటం చేయనందుకు మేము చాలా విచారిస్తున్నాము.’’ అని ఆయన ప్రకటించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని