ప్రధాని ప్రసంగంతో దారికొచ్చిన చైనా

ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం చైనా గుండెల్లో గుబులు రేపినట్లుగా కనపడుతోంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వారికి భారత సైనికులు అదే రీతిలో బదులిచ్చారని....

Published : 17 Aug 2020 21:06 IST

భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటన

దిల్లీ/బీజింగ్: ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం చైనా గుండెల్లో గుబులు రేపినట్లుగా కనపడుతోంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వారికి భారత సైనికులు అదే రీతిలో బదులిచ్చారని ప్రధాని మోదీ తన స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో చైనా, పాకిస్థాన్‌లను ఉద్దేశించి అన్నారు. తాజాగా ప్రధాని మోదీ ప్రసంగంపై చైనా విదేశాంగశాఖ స్పందించింది. భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు. ‘‘భారత్-చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు. రెండు పొరుగు దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయి. అలానే ఆయా ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందిస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఇరు పక్షాలు ఒకరినొకరు గౌరవించుకొని, సహాయసహకారాలు అందజేసుకోవాలి. ఇందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది. రాజకీయంగా పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకుని, ఇరువురి మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని, ద్వైపాక్షిక సంబంధాలను ధృడపరచుకునేందుకు చైనా సంసిద్ధంగా ఉంది’’ అని ఝావో తెలిపారు.

గత రెండు నెలలుగా భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. జూన్ 15న గల్వాన్‌లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. అనంతరం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గల్వాన్‌ ఘటనను ఉటంకిస్తూ ప్రధాని మోదీ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వరకు మన భూభాగంపై కన్నెత్తి చూసినవారికి దేశ వీర జవాన్లు అదే భాషలో సమాధానమిచ్చారని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని