వారే మా ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తున్నారు: చౌహాన్‌

మధ్యప్రదేశ్‌ ఉపఎన్నికల ఫలితాలు రెండు రోజుల్లో వెలువడనుండగా అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తమ ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి భాజపా యత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌నాథ్‌ శుక్రవారం ఆరోపణలు చేయగా..

Published : 07 Nov 2020 22:41 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల ఫలితాలు రెండు రోజుల్లో వెలువడనుండగా అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తమ ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి భాజపా యత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌నాథ్‌ శుక్రవారం ఆరోపించగా.. తాజాగా సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా శనివారం కాంగ్రెస్‌పై అదే తరహా ఆరోపణలు చేశారు. ‘కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌ భాజపా ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి విఫలయత్నాలు చేస్తున్నారు. వారిని ప్రభావితం చేయడానికి అవకతవకలకు పాల్పడుతున్నారు’ అంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతికి కమల్‌నాథే కారణమన్నారు. ఆయన ప్రయత్నాలకు భాజపా ఎమ్మెల్యేలు ఎప్పటికీ లొంగబోరని.. తమ ఎమ్మెల్యేలు పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేస్తారని వెల్లడించారు. 

శుక్రవారం కమల్‌నాథ్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘భాజపా ఉప ఎన్నికల్లో పరాజయం పాలవనుంది. వారు ఇప్పటికే ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నారు. నేను ఇప్పటికే కొద్ది మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను. భాజపా నుంచి ఆఫర్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు’ అని భాజపాపై విమర్శలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. వారు భాజపాలో చేరడంతో సంఖ్యాబలం నెగ్గి శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం అనారోగ్య కారణాలతో మరణించడంతో ఖాళీ అయిన మొత్తం 28 స్థానాలకు నవంబర్‌ 3న ఉపఎన్నికలు నిర్వహించారు. ఫలితాలు నవంబర్‌ 10న రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని