ఆల్కహాల్‌ లేని శానిటైజర్లే ఉత్తమం 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్‌ వాడకం బాగా పెరిగింది. అయితే శానిటైజర్‌లో కొంత ఆల్కహాల్ పరిమాణం ఉండటం వల్ల  దీనిని ఎక్కువగా ఉపయోగించిన వారికి కొంత నష్టం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్కహాల్‌  పరిమాణం లేని శానిటైజర్లు కూడా అంతే  స్థాయిలో..

Published : 04 Dec 2020 01:33 IST

వాషింగ్టన్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్ల వాడకం బాగా పెరిగింది. అయితే శానిటైజర్‌లో కొంత ఆల్కహాల్ పరిమాణం ఉండటం వల్ల  దీనిని ఎక్కువగా ఉపయోగించిన వారికి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్కహాల్‌ లేని శానిటైజర్లు కూడా అంతే  స్థాయిలో పని చేస్తాయని, వాటివల్ల ఇతర సమస్యలు కూడా ఉండవని అమెరికాకు చెందిన బ్రిగమ్‌ యంగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.  పరిశోధనలో భాగంగా వీరు ఆల్కహాల్‌కు బదులు  బెంజాల్కోనియం క్లోరైడ్‌, కొన్ని అమ్మోనియం మిశ్ర ధాతువులను వినియోగించారు. ఈ శానిటైజర్‌ 15 సెకెన్లలో 99.9 శాతం వైరస్‌ను నాశనం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పరిశోధనలో భాగంగా.. కొవిడ్‌ నమూనాలను కొన్ని టెస్ట్‌ట్యూబ్‌లలో తీసుకున్నారు.  ఆల్కహాల్‌కు బదులు  0.2 శాతం బెంజాల్కోనియం క్లోరైడ్‌, క్వార్టర్నరీ అమ్మోనియం మూలకాలను కలిపారు. పరిశోధన అనంతరం టెస్ట్‌ట్యూబ్‌లోని వైరస్‌ నమూనాలను సజీవ కణాలపై  ప్రయోగించారు. అయితే వైరస్‌ ప్రభావం ఆ కణాలపై ఏమాత్రం కనిపించలేదు. దీనిని బట్టి టెస్ట్‌ ట్యూబ్‌లోని మూలకాల ప్రభావానికి వైరస్‌ నశించిపోయిందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.

శానిటైజర్ ఎక్కువగా అవసరమైన ఆస్పత్రులు, వివిధ కార్యాలయాల్లో ఈ ఆల్కహాల్‌ ఫ్రీ శానిటైజర్‌ ఉపయోగించడం ఉత్తమమని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తికి ముందుకు కూడా ఈ శానిటైజర్లు అందుబాటులో ఉండేవని, అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి సక్రమంగా పని చేస్తాయని, ప్రభుత్వాలు అవగాహన కల్పించకపోవడంతో ఆదరణ కరవైందని పరిశోధనకు నాయకత్వం వహించిన ఆంటోనియో సోలిస్‌ లిల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని