ఆ 27దేశాల్లో ఒకేరోజు టీకా పంపిణీ ప్రారంభం!

యూరోపియన్‌ యూనియన్‌కి చెందిన 27దేశాల్లో ఒకేరోజు వ్యాక్సిన్‌ ప్రారంభమవనున్నట్లు ఇటలీలో కరోనా మహమ్మారిపై నియమించిన ప్రత్యేక కమిషనర్ డొమెనికో అర్క్యూరీ‌ వెల్లడించారు.

Updated : 21 Dec 2022 16:33 IST

రోమ్‌: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీకి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యవసర వినియోగం కింద కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టాయి. ఇక కరోనా ధాటికి వణికిపోతోన్న యూరప్‌లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, యూరోపియన్‌ యూనియన్‌కి చెందిన 27దేశాల్లో ఒకేరోజు వ్యాక్సిన్‌ ప్రారంభమవనున్నట్లు ఇటలీలో కరోనా మహమ్మారిపై నియమించిన ప్రత్యేక కమిషనర్ డొమెనికో అర్క్యూరీ‌ వెల్లడించారు. ఈ రోజునే అన్ని దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభిస్తాయని.. అనంతరం ఆయా దేశాలు వాటిని కొనసాగిస్తాయని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్‌ పంపిణీ ఏరోజు ప్రారంభం అవుతుంది, ఆరోజు ఎంతమందికి వ్యాక్సిన్‌ ఇస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. భారీ స్థాయిలో చేపట్టే వ్యాక్సినేషన్‌ చేపట్టే కన్నా ముందే  రోజున ఒకేసారి అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ఉంటుందని ప్రకటించారు.

ఇక ఇటలీలో తొలిదశలో 18లక్షల ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్‌ హోం సిబ్బందికి వ్యాక్సిన్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ ఎత్తున చేపట్టే వ్యాక్సిన్‌ పంపిణీ కోసం నగరంలోని 300 మైదానాలతో పాటు బహిరంగ ప్రదేశాలను సిద్ధం చేస్తున్నారు. యూరోపియన్‌ యూనియన్‌లో జనవరి రెండో వారంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి..
లంగ్స్‌పై కరోనా ప్రభావం..శాస్త్రవేత్తల డీకోడ్‌..!
గాల్లోంచి ఊడిపడి..యుద్ధాన్ని గెలిపించారు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని