పీజీ వైద్య విద్యలో కీలక మార్పులు

పీజీ వైద్య విద్యార్ధులందరూ జిల్లా ఆస్పత్రులలో మూడు నెలల పాటు సేవలందించటటం తప్పనిసరి

Published : 22 Sep 2020 01:56 IST

 

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

దిల్లీ: దేశంలోని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య నిపుణుల (స్పెషలిస్టు డాక్టర్‌) సేవలు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పీజీ వైద్య విద్యార్థులందరూ జిల్లా ఆస్పత్రులలో మూడు నెలల పాటు సేవలందించటాన్ని వారి విద్యాప్రణాళికలో తప్పనిసరి చేసింది. కాగా, ఈ నిర్ణయం 2020-21 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

‘‘ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956 పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ.. వారి పాఠ్యాంశాలలో భాగంగా మూడు నెలల పాటు జిల్లా ఆస్పత్రులు లేదా జిల్లా ఆరోగ్య శాఖలో సేవలను అందించటం తప్పనిసరి’’ అని ప్రభుత్వం అధికారిక ప్రకటనను జారీచేసింది. ఈ నిర్ణయం వల్ల జిల్లా ఆస్పత్రులకు స్పెషలిస్టు వైద్యులు లభించటంతో పాటు.. విద్యార్థులకు క్షేత్ర స్థాయి శిక్షణ కూడా లభిస్తుందని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీ.కే. పాల్‌ అభిప్రాయపడ్డారు.

కొత్త నిబంధనల మేరకు పీజీ విద్యార్థుల కోసం ‘డిస్ట్రక్ట్‌ రెసిడెన్సీ’ అనే ఓ కొత్త కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. డిస్ట్రక్ట్‌ రెసిడెన్సీ కార్యక్రమాన్ని సంతృప్తికరంగా పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే సంబంధిత పీజీ కోర్సులో చివరి సంవత్సరం పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత లభిస్తుందని అధికారులు తెలిపారు. మూడు సంవత్సరాల పీజీ వైద్య కోర్సులో మూడు, నాలుగు లేదా ఐదో సెమిస్టర్‌లో పీజీ వైద్య విద్యార్థులు జిల్లా ఆస్పత్రిలో సేవలందించాలని ఈ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని