ఫైజర్‌ టీకాతో అలెర్జీ: ఆ సంస్థ ఏమందంటే..

అలాస్కాకు చెందిన ఓ ఆరోగ్య కార్యకర్తకు.. ఫైజర్‌ టీకా తీసుకున్న అనంతరం తీవ్రమైన అలెర్జీ లక్షణాలు

Updated : 17 Dec 2020 11:21 IST

జునేవూ (అలాస్కా): అమెరికాలో కొవిడ్‌ నిరోధక టీకా పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అలాస్కాకు చెందిన ఓ ఆరోగ్య కార్యకర్తలో.. ఫైజర్‌ టీకా తీసుకున్న అనంతరం అలెర్జీ లక్షణాలు కనిపించినట్టు తెలిసింది. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం వ్యాక్సిన్‌ను తీసుకున్న కొద్ది నిముషాల్లోనే ఆ వ్యక్తిలో ఈ ప్రతికూల ఫలితాలు బహిర్గతమయ్యాయి. కాగా, బ్రిటన్‌లో కూడా గతవారం ఇటువంటివే రెండు కేసులు వెలుగుచూశాయి.

కొన్ని నిర్దిష్ట ఔషధాలు, ఆహార పదార్ధాలు తదితరాల వల్ల అలెర్జీ తలెత్తే ఆరోగ్య పరిస్థితిని అనాఫిలాక్సిస్‌ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఫైజర్‌-బయో ఎంటెక్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవద్దంటూ బ్రిటన్‌ వైద్య నిపుణులు సూచించారు. అలెర్జీ లక్షణాలున్న పలువురు అమెరికన్లు ఈ టీకా తీసుకున్నప్పటికీ సురక్షితంగానే ఉన్నట్టు యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌  తెలిపింది. వ్యాక్సిన్లు, దానిలోని సమ్మేళనాల పట్ల  ఎలర్జీ ఉన్నవారు మాత్రమే ఫైజర్‌ టీకాను వినియోగించవద్దని సంస్థ సూచించింది. అలాస్కాకు చెందిన వ్యక్తికి గతంలో అలెర్జీ లేదని చికిత్స అందిస్తున్న ఇక్కడి బార్ట్‌లెట్‌ రీజనల్‌ హాస్పిటల్‌ వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యక్తిలో చికిత్స అనంతరం అలెర్జీ లక్షణాలు ఉపశమించాయిని కూడా వారు తెలిపారు.

ఈ విషయమై ఫైజర్‌ స్పందిస్తూ.. అనాఫిలాక్సిస్‌ లేదా అలెర్జీ కలిగినవారు సరైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే తమ వ్యాక్సిన్‌ను తీసుకోవాలనే సమాచారాన్ని స్పష్టంగా టీకా లేబుల్‌పై వివరించామని తెలిపింది. తాజా సంఘటనల నేపథ్యంలో అవసరమైతే ఈ సమాచారాన్ని మరింత మెరుగ్గా, సరళమైన భాషలో వివరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

ఇవీ చదవండి

ఫైజర్‌ టీకా వినియోగానికి అమెరికా అనుమతి

ట్రంప్‌: టీకా తీసుకునేందుకు సిద్ధమే..కానీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని