Updated : 09 May 2021 12:03 IST

భారత్‌కు అమెరికా కార్పొరేట్‌ అండ

వివిధ దేశాల నుంచికొనసాగుతున్న కొవిడ్‌ సాయం

వాషింగ్టన్‌: భారత్‌కు విదేశాల నుంచి కొవిడ్‌ సాయం కొనసాగుతోంది. అమెరికా కార్పొరేట్‌ రంగం మరింతగా వైద్య సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అధిక సంఖ్యలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపుతోంది. ‘‘భారత్‌లోని మా సహచరుల కోసం, ప్రజల కోసం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా అత్యవసర వైద్య అవసరాలను పంపుతున్నాం’’ అని థర్మో ఫిషర్‌ సంస్థ పేర్కొంది. వైరస్‌ను అడ్డుకునేందుకు ఉపయోగపడే 4.6 మిలియన్ల వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం ట్యూబులను పంపినట్టు తెలిపింది. రెడ్‌క్రాస్‌తో కలిసి భారత్‌ తదితర దేశాలకు మానవతా సాయం అందిస్తున్నట్టు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఆమ్వే సంస్థ రూ.3.66 కోట్ల (5 లక్షల డాలర్ల) సాయం ప్రకటించింది. అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నెలకొల్పిన ఫౌండేషన్‌ ద్వారా దీన్ని అందజేయనుంది. ఈ మొత్తం ద్వారా వెయ్యి వెంటిలేటర్లు, 25 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపనున్నారు. డేవిడ్‌ అండ్‌ కేరల్‌ వాన్‌ ఆండ్రెల్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌... రూ.1.83 కోట్ల (2.5 లక్షల డాలర్ల) సాయం ప్రకటించింది. వీరందరికీ అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక అధ్యక్షుడు ముఖేశ్‌ ఆఘి ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు అందించే నిమిత్తం అమెరికన్‌ ఇండియన్‌ ఫౌండేషన్‌కు చబ్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ రూ.3.66 కోట్ల (5 లక్షల డాలర్ల) సాయం అందించింది. ఈ మొత్తంతో దేశ వ్యాప్తంగా 100 ఆసుపత్రుల్లో పడకలను సమకూర్చుతారు.
భారతీయ అమెరికన్‌ వైద్యులు ఇటీవల స్థాపించిన ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిజీషియన్స్‌ అసోసియేషన్‌(ఫిపా)’ ద్వారా భారత్‌కు 5 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపుతున్నారు. స్థానిక భాగస్వామ్య ఆసుపత్రులు, ఐసోలేషన్‌ కేంద్రాలు, మొబైల్‌ ఆసుపత్రులకు వీటిని అందిస్తామని ఫిపా అధ్యక్షుడు డా.రాజ్‌ భయానీ తెలిపారు. 

వెన్నంటే ఉంటాం 

న్యూయార్క్‌: కొవిడ్‌ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌కు అండగా ఉంటామని అమెరికా అభయమిచ్చింది. దేశంలో మహమ్మారి తీవ్రతపై... ఉభయ దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు హర్షవర్ధన్, జేవియర్‌ బెసెర్రాలు శనివారం వీడియో విధానంలో చర్చించారు. రెండు దేశాల ఆరోగ్య విషయంలోనే కాకుండా... కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ ప్రతిస్పందనకు భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సహకారం ఎంతో కీలకమని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. మహమ్మారి తొలినాళ్లలో అమెరికా ఆసుపత్రులు కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడినప్పుడు భారత్‌ తమకెంతో అండగా నిలిచిందని బెసెర్రా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం భారత్‌ కష్టంలో ఉందని, కొవిడ్‌పై పోరాటంలో తమ దేశం తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు. సరైన సమయంలో సాయంచేసే అవకాశం తమకు లభించిందన్నారు. అమెరికా అందిస్తున్న సాయానికి హర్షవర్ధన్‌ ధన్యవాదాలు తెలిపారు.

* కాగా- భారత్‌ క్షేమం తమకెంతో ముఖ్యమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పునరుద్ఘాటించారు. సంక్షోభ సమయాన భారత్‌కు అండగా ఉంటామన్నారు. - అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి అభయం

అంతర్జాతీయ సమాజం తోడు నిలుస్తోంది

దిల్లీ: కొవిడ్‌పై పోరాటంలో అంతర్జాతీయ సమాజం భారత్‌కు తోడు నిలుస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. దేశ వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాయం పంపుతుండటాన్ని ప్రశంసించింది. గత నెల 27 నుంచి ఈనెల 7 వరకూ... వివిధ దేశాల నుంచి మొత్తం 6,608 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 3,856 ఆక్సిజన్‌ సిలిండర్లు, 14 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 4,330 వెంటిలేటర్లు, 3 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ వచ్చినట్టు తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 2,060 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 467 వెంటిలేటర్లు, 3 ఆక్సిజన్‌ ప్లాంట్లు అందినట్టు వెల్లడించింది. వీటిని అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య వేదికతో పాటు... స్విట్జర్లాండ్, పోలాండ్, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్‌లు పంపినట్లు తెలిపింది. వీటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే నిమిత్తం కేటాయించి, సత్వరం పంపిణీ చేస్తున్నట్టు వివరించింది. - కేంద్ర ఆరోగ్యశాఖ

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని