ఆమ్నెస్టీ ఇండియా అనూహ్య నిర్ణయం!

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని...

Updated : 29 Sep 2020 19:06 IST

భారత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు

దిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని ఆరోపించింది. సెప్టెంబరు 10 నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమ ఖాతాలన్నీ స్తంభింపజేసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ కార్యకలాపాల్ని బలవంతంగా నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంపై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వం కావాలనే తమని నిరంతరంగా వెంటాడుతోందని ఆరోపించింది. 

దీంట్లో ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు విదేశీ నిధులు చట్టవిరుద్ధంగా అందుతున్నాయని కేంద్రం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో 2018లో బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. గతేడాది దీనిపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్‌ చోటుచేసుకుందన్న ఆరోపణలతో తాజాగా బ్యాంక్‌ ఖాతాల్ని స్తంభింపజేసింది. అలాగే ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010(ఎఫ్‌సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో సంస్థపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 

ఈ నేపథ్యంలో తాము దేశంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఆరోపించింది. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై గళం వినిపిస్తున్నందుకే తమని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. కావాలని దురుద్దేశంతోనే ప్రభుత్వం తమపై ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తోందని ఆరోపించింది. చట్టాలకు లోబడే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. గత ఎనిమిదేళ్లలో దేశంలో 40 లక్షల మందికి పైగా సంస్థకు సహకరించారని పేర్కొంది. 10 లక్షల మంది భారతీయులు ఆర్థిక సాయం అందజేశారని తెలిపింది. ప్రభుత్వంపై గళం ఎత్తుతున్న వారిలో భయం నెలకొల్పేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తోందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కుమార్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని