Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌

 మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ అయ్యారు. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు.

Updated : 02 Nov 2021 11:09 IST

ముంబయి: మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ అయ్యారు. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు. కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ చేశారని ఆరోపణలు రావడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మనీలాండరింగ్‌ అంశంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీనిపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటకీ కోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే ఇటీవల దేశ్‌ముఖ్‌ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది. 

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. 

మనీలాండరింగ్‌పై తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఓ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమనీ ఆయన పేర్కొన్నారు. అయితే అనిల్‌ దేశ్‌ముఖ్‌ లంచం ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని