శాంతి ఒప్పందంపై ఆగ్రహించి స్పీకర్‌పై దాడి

ఆర్మేనియా స్పీకర్‌పై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. రష్యా, అజర్‌బైజాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశ ప్రధాని నికోల్ పాషిన్యాన్ ప్రకటించడంతో కోపంతో ఊగిపోయిన నిరసనకారులు....

Updated : 10 Nov 2020 19:20 IST

తీవ్రంగా గాయపడ్డ ఆర్మేనియా స్పీకర్‌కు శస్త్రచికిత్స

యెరెవాన్‌: ఆర్మేనియా స్పీకర్‌పై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. రష్యా, అజర్‌బైజాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశ ప్రధాని నికోల్ పాషిన్యాన్ ప్రకటించడంతో కోపంతో ఊగిపోయిన నిరసనకారులు రాజధాని యెరెవాన్‌లోని పార్లమెంటులోకి చొరబడి స్పీకర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో స్పీకర్‌ అరారత్ మిర్జోయన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. దాడి విషయాన్ని ఆర్మేనియా ప్రధానమంత్రి పాషిన్యాన్‌ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. స్పీకర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

‘కొందరు దుండగులు అరారత్‌ మిర్జోయన్‌పై దాడి చేశారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. స్పీకర్‌కు ఎలాంటి అపాయం లేదు’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు నేతలు, అధికారులతో కలిసి లోతుగా విశ్లేషించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మరో పోస్టులో తెలిపారు.

అజర్‌బైజాన్, రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన వెంటనే యెరెవాన్‌ వీధుల్లో తుపాకుల పేలుళ్లు వినిపించాయి. కోపంతో రగిలిపోయిన నిరసనకారులు ప్రధాని నికోల్ పాషిన్యాన్‌ కోసం వెతుకుతూ మంగళవారం తెల్లవారుజామున ప్రభుత్వ భవనంలోకి ప్రవేశించి నిరసన తెలిపారు. కాగా దాడి, నిరసనలకు చెందిన వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. శాంతి ఒప్పందంపై నిరసనలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని