Updated : 29 Oct 2020 14:08 IST

పాక్‌ ఆర్మీ జనరల్‌ వణికిన వేళ..

అభినందన్‌ను వెళ్లనీయండి బాబోయ్‌ అన్న పాక్‌ మంత్రి

ఇస్లామాబాద్‌: పాక్‌తో వైమానిక పోరులో శత్రువులను తరిమికొట్టిన భారతీయ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ విషయంలో ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా గజగజ వణికారట. ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంటు సభ్యుడు ఒకరు స్వయంగా వెల్లడించారు. వర్థమాన్‌ను విడుదల చేయకపోతే భారత్‌ తమపై దాడిచేయనుందని నాటి ఓ అత్యున్నత సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి షా మెహ్‌మూద్‌ వెల్లడించారట.

కాళ్లు వణుకుతూ.. చెమటలు పట్టి..

‘‘ఫిబ్రవరి 2019 నాటి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తిరస్కరించారు. ఈలోగా పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ బాజ్వా సమావేశం జరుగుతున్న గదిలోకి వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లు వణుకుతున్నాయి.. శరీరమంతా చెమటలు పట్టి ఉంది. చర్చల అనంతరం పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మెహ్‌మూద్‌ ఖురేషీ.. మీకు పుణ్యముంటుంది.. అభినందన్‌ను వెళ్లనీయండి .. లేదంటే భారత్‌ రాత్రి 9 గంటలకు మనమీద దాడి చేసేందుకు సిద్ధమవుతోంది అన్నారు.’’ అని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) నేత అయాజ్‌ సాదిక్‌ నాటి సంఘటనా క్రమాన్ని ఆ దేశ పార్లమెంటులో వెల్లడించారు. దీనితో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం భారతీయ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను వెంటనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్‌కు చెందిన జైష్‌-ఎ-మోహమ్మద్‌ తీవ్రవాద స్థావరంపై భారత్‌ వాయుసేన విరుచుకుపడింది. ఫిబ్రవరి 27, 2019న కశ్మీరులో పాక్‌ విమానం చొరబాటును అడ్డుకోవటంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అసమాన ప్రతిభ ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన వైమానిక పోరులో పాక్‌కు చెందిన ఓ ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని తన మిగ్‌-21 విమానంతో వెంటాడి మరీ కూల్చివేశారు. అయితే ఈ ఘర్షణలో తన విమానం కూడా కూలిపోవటంతో భారత వింగ్‌ కమాండర్‌ అత్యవసరంగా కిందికి దిగవలసి వచ్చింది. అది పాక్‌ భూభాగం కావటంతో వర్థమాన్‌ను పాక్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇరుదేశాల చర్చల అనంతరం మార్చి 1, 2019న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. ఆయన అసమాన సాహసానికి గాను భారత ప్రభుత్వం అభినందన్‌కు వీర చక్రను బహూకరించింది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని