Published : 02/11/2020 00:47 IST

ఇండియన్‌ ఆర్మీ.. మనసున్న సైన్యం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సైన్యం కశ్మీర్‌లో ఉగ్రవాదులతో కఠినగా వ్యహరించినా.. స్థానికులతో స్నేహ పూర్వకంగా మెలుగుతుంది. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొంటుంది. అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సైన్యం దృష్టికి వస్తే కచ్చితంగా సాయం చేస్తుంది.. యువతకు క్రీడా మైదానాలు సమకూర్చడం.. ఉపాధి శిక్షణ ఇప్పించడం.. ఉపాధి కల్పన మార్గాలు చూపించడం వంటివి సైన్యం చేస్తుంటుంది. సైనిక అధికారులు కూడా అక్కడి ప్రజలతో ప్రేమగా ఉంటూ వారి అవసరాలు తీరుస్తుంటారు. తాజాగా ఓ యువ మేజర్‌ కూడా ఇలాంటి పనే చేస్తున్నారు. 

కశ్మీర్‌ రక్షణ బాధ్యతలు చూసే రాష్ట్రీయ రైఫిల్స్‌లో మేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కమలేష్‌ మణి ఒక రోజు చంజ్‌ముల్లా ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. అక్కడ గౌహుర్‌ మిర్‌ అనే 16ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ బాలుడు వినలేడు.. మాట్లాడలేడు. కొన్నాళ్ల తర్వాత కమలేష్‌ ఆ బాలుడిని ఆర్మీ క్యాంప్‌కు తీసుకొచ్చి.. ఒక జత బూట్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ మర్నాడే మిర్‌ ఒక బుట్ట నిండా యాపిల్స్‌ను తీసుకొచ్చి కమలేష్‌కు ఇచ్చాడు. మిర్‌ కుటుంబాన్ని ఒక రోజు కమలేష్‌  కలుసుకొన్నారు. ఆ బాలుడి చదువు, వైద్యానికి అవసరమయ్యే మొత్తం తాను భరిస్తానని వారికి చెప్పాడు. ఈ మాటతో ఆ బాలుడి కుటుంబం ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. తమకు సాయం చేయడానికి ఒకరు వచ్చినందుకు సంతోషించింది. వాస్తవానికి కమలేష్‌ ఆ గ్రామానికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఈ ఏడాది ఆ గ్రామం వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక కల్నల్‌, మేజర్‌, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఆ గ్రామం నిత్యం నిఘా నీడన ఉంటుంది.

స్కూల్‌ మార్చి..

తొలుత మిర్‌ బారాముల్లాలోని ఒక పాఠశాలకు వెళ్లాడు. కానీ, అక్కడ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మేజర్‌ కమలేష్‌ ఆ బాలుడిని హంద్వారాలోని మరో పాఠశాలలో చేర్చారు. అక్కడ మిర్‌ వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు ఒక టీచర్‌ ఉన్నారు. 

రాష్ట్రపతి పతక విజేత..

కమలేష్‌ మణి బెంగళూరులోని మిలటరీ స్కూల్‌లో చదువుకొని పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నుంచి శిక్షణ పొందారు. ఆయనకు 2013లో ఇండియన్‌ మిలటరీ అకాడమీలో రాష్ట్రపతి పతకం లభించింది. ఆ పతకం పొందే హక్కు తనను తీర్చిదిద్దిన పాఠశాలకే ఉంటుందని కమలేష్‌ భావించారు. ఆ పాఠశాలకే పతకాన్ని అందజేశారు. 

ప్రాణం పోయినా.. బాధ్యత వీడని వీరుడు..

కార్గిల్‌ యుద్ధంలో మరణించిన వైజయంత్‌ థాపర్‌ (వీర్‌ చక్ర)ది మరో కథ. 1999లో ఆయన పనిచేస్తున్న ఆర్మీ క్యాంప్‌ సమీపంలో రుక్సాన అనే ఆరేళ్ల బాలిక ఉండేది. ఆ పాప తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో వైజయంత్‌ ఆ బాలిక బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధం మొదలు కావడంతో ఆయన తన కుటుంబానికి ఒక లేఖ రాశారు. తనకు యుద్ధంలో ఏమైనా అయితే రుక్సానాకు సాయం అందించే బాధ్యతలు స్వీకరించాలని తండ్రి విఎన్‌  థాపర్‌(మాజీ కర్నల్‌)ను కోరారు. దురదృష్టవశాత్తు అదే వైజయంత్‌ చివరి లేఖ. టోలోలింగ్‌ శిఖరంపై భారత్‌ విజయం కోసం‌ పోరాడుతూ వైజయంత్‌ ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత వైజయంత్‌ తండ్రి.. కుమారుడి చివరి కోర్కెను తీర్చే బాధ్యతను స్వీకరించి కొనసాగిస్తున్నారు. దటీజ్‌ ఇండియన్‌ ఆర్మీ.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని