
Aryan Khan: కరెంట్ కట్ వల్లే ఆర్యన్ ఖాన్ విడుదల ఆలస్యం..!
ముంబయి: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు గత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. నిజానికి అతడికి గురువారమే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరుచేసినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో రెండు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఈ ఆలస్యానికి కరెంట్ కోతలే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు ఈ కేసులో మరో నిందితుడైన అర్బాజ్ మర్చెంట్ తండ్రి, సీనియర్ న్యాయవాది అస్లామ్ మర్చెంట్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా అర్బాజ్, మున్మున్లకు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు గత గురువారం తీర్పు వెలువరించింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఉత్తర్వులను ఆ మరుసటి రోజు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు కోర్టు నుంచి అందడం ఆలస్యమవడంతో ఆర్యన్ శుక్రవారం రాత్రి కూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే కోర్టులో విద్యుత్ అంతరాయం కారణంగా రిలీజ్ మెమో ఆలస్యంగా వచ్చిందని అస్లామ్ తాజాగా వెల్లడించారు. ‘‘బెయిల్‌కు సంబంధించి రిలీజ్ మెమో టైప్ చేస్తుండగా.. కోర్టులో పలుసార్లు కరెంట్ కట్ అయ్యింది. దాదాపు 25 నుంచి 35 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అందువల్ల ఆర్యన్ విడుదల ఉత్తర్వులు అతడి న్యాయ బృందానికి ఆలస్యంగా అందాయి. దీంతో వారు సాయంత్రం 5.30 గంటల్లోగా జైలుకు చేరుకోలేకపోయారు’’ అని అస్లామ్ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం కోర్టు ఉత్తర్వులు తీసుకుని షారుక్ న్యాయబృందం ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లేసరికి నిర్దిష్ట గడువు దాటిపోయింది. సమయం పొడిగించేందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. శనివారం ఉదయం విడుదల ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం ఉదయం 11 గంటలకు ఆర్యన్‌ను అధికారులు జైలు నుంచి విడుదల చేశారు.
ఇవీ చదవండి
Advertisement