శీతాకాలంలో.. వైరస్‌ మనుగడ ఎక్కువే!

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల వైరస్‌ కణాలు ఎక్కువకాలం మనుగడ సాధిస్తూ వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Published : 19 Dec 2020 00:25 IST

హూస్టన్‌: కరోనా వైరస్ ఏయే ప్రదేశాలు, వస్తువులపై ఎంతకాలం క్రియాశీలకంగా ఉంటుందనే విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక వివిధ వాతావరణ పరిస్థితుల్లో వైరస్‌ ఎంతకాలం ప్రభావం చూపిస్తుందోననే విషయంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఉపరితలాలపై వైరస్‌ మనుగడ సాధించడానికి వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తాయా? అనే అంశంపైనా నిపుణులు దృష్టి సారించారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల వైరస్‌ కణాలు ఎక్కువకాలం మనుగడ సాధిస్తూ వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలున్నాయని అమెరికాలోని ఉతాహ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.

గ్లాసు ఉపరితంలో వైరస్‌ మాదిరిగా ఉండే కణాల (వీఎల్‌పీలు)ను వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉంచి శాస్త్రవేత్తలు పరీక్షించారు. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల వచ్చే తుంపరులు బయటకు విడుదలైనప్పుడు వాతావరణంలో ఉండే తేమ వల్ల అవి తొందరగా ఎండిపోతాయి. మిగిలిన కణాలు ఇతరుల్లోకి ప్రవేశిస్తాయి. ఇలా ఎండిపోయే ముందు గాలిలో అవి ప్రయాణించే దూరంపై తేమ ప్రభావితం చూపిస్తుంది. కానీ, వీఎల్‌పీలపై మాత్రం తేమ ప్రభావం తక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇక, కరోనా వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 వ్యాప్తి చెందడానికి ఒక నిర్దిష్ట వరుసలో అమర్చినటువంటి ప్రోటీన్లు ఉండాలి. ఒకవేళ అలాంటి నిర్మాణం సరిగ్గా లేకపోతే మాత్రం వైరస్‌ వ్యాపించడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. వీటికి స్పల్ప వేడి తగిలినా ఈ వరుస విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతకు ఈ వీఎల్‌పీ కణాలు తేలికగా మార్పుచెందుతాయి. అందుకే వేడి ఎక్కువగా ఉంటే వాటి వ్యాప్తి ప్రభావం తక్కువగానే ఉంటుంది. కానీ, శీతాకాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కరోనా వైరస్‌ కణాలు ఉపరితలంపై ఎక్కువకాలం ఉంటూ అంటువ్యాధి వ్యాప్తికి కారణమవుతాయని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

ఇవీ చదవండి..
కొవిడ్‌-19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!
కొవిడ్‌ వ్యాక్సిన్‌కు అక్కడ మిశ్రమ స్పందనే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని