
ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాజీనామా
దిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌లో ఆయన ఏడీబీలో బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో తనను ఆగస్టు 31లోగా రిలీవ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తన రాజీనామా లేఖను పంపినట్టు తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘంలో లావాసా ఇంకా రెండేళ్ల పాటు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) సునీల్ అరోడా పదవీ విరమణ 2021 ఏప్రిల్‌లో చేయాల్సి ఉండగా.. తదుపరి సీఈసీగా లావాసాకే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లావాసా పదవీ కాలం అక్టోబర్ 2022 వరకు ఉంది. ఏడీబీ ఉపాధ్యక్షుడిగా లావాసా నియమకంపై జులై 15న బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం ఏడీబీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న దివాకర్ గుప్తా పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది.