
టీకా ఉమ్మడి ప్రయోగాల్లో మరో ముందడుగు!
ఒప్పందంపై సంతకం చేసిన ఆస్ట్రాజెనెకా, ఆర్డీఐఎఫ్
మాస్కో: బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా, రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు రెండూ కలిపి జరుపనున్న ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. సంయుక్త ప్రయోగాల కోసం రష్యాలోని గమలేయా ఇన్స్టిట్యూట్, ఆస్ట్రాజెనెకా సంస్థలు పరస్పర సహకారం చేసుకునేందుకు ఒప్పందానికి సిద్ధమైనట్లు ఈ మధ్యే ప్రకటించాయి. తాజాగా ఇరు కంపెనీలు ఆ ఒప్పందంపై సంతకం చేసినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. రెండు టీకాలను కలిపితే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరగవచ్చనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను ఉపయోగించి ఆస్ట్రాజెనెకా ప్రయోగాలు ప్రారంభించనుంది.
ఆస్ట్రాజెనెకాతో మాట్లాడిన పుతిన్..
రెండు వ్యాక్సిన్లు కలిసి ప్రయోగాలు చేస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రయోగ వివరాలు, సహకారంపై వారితో చర్చించారు. మరోవైపు ఈ రెండు వ్యాక్సిన్లను అడినోవైరస్ ఆధారంగానే రూపొందించారు. ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడం వల్ల ప్రజలకు కొవిడ్ నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందా అన్నది తేల్చేందుకు పరిశోధకులు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్ 90శాతం సమర్థత కలిగినట్లు వెల్లడించగా, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కూడా 70శాతానికిపైగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించాయి.
ఇవీ చదవండి..
స్పుత్నిక్ టీకా: 95శాతం సమర్థవంతంగా..!
కొత్తరకం వైరస్‌పై WHO ఏమందంటే..!