‘తుది ఆమోదానికి చేరువలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్’

కొవిడ్‌-19 కట్టడి కోసం ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ అమెరికాలో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ప్రజావినియోగానికి తుది ఆమోదం పొందడానికి అతి దగ్గరలో ఉందని ప్రకటించారు.......

Published : 01 Sep 2020 09:52 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కట్టడి కోసం ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అమెరికాలో మూడో దశకు చేరుకున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ప్రజా వినియోగానికి తుది ఆమోదం పొందడానికి అతి దగ్గరలో ఉందని ప్రకటించారు. ‘‘అమెరికాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో దశకు చేరుకున్నాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఇప్పటికే ఆఖరి దశకు చేరుకున్న టీకాల సరసన ఇది కూడా చేరింది. అసాధ్యం అనుకున్న పనుల్ని అమెరికాలో మేం చేసి చూపిస్తున్నాం’’ అని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ అన్నారు.

మరోవైపు ఆస్ట్రాజెనెకా సైతం దీనిపై స్పందించింది. ‘‘అమెరికా వ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగ కేంద్రాలు 30 వేల మంది వాలంటీర్లను నమోదుచేసుకున్నాయి. వీరంతో 18 ఏళ్ల పైబడినవారే. అలాగే వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన వారు వీరిలో ఉన్నారు. హెచ్‌ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇందులో ఉన్నారు. కరోనా సోకే ప్రమాదం ఉన్న వారిని కూడా ఇందులో చేర్చాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. 

జనవరి 2021 కల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. 300 మిలియన్ల సురక్షితమైన కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా తాజా ప్రయోగాల్ని జరుపుతోంది. ఆస్ట్రాజెనెకాతో పాటు మోడెర్నా, ఫైజర్‌ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు సైతం ప్రస్తుతం మూడో దశలో ఉన్నాయి.

ఇదీ చదవండి..
ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని