
ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేశారు: గహ్లోత్
జైపుర్: రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి భాజపా కుట్రలు చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. ఈ ఏడాది ఆరంభంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రహస్య మంతనాలు జరిపారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సిరోహి జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు.
‘‘జులైలో వారు (భాజపా) రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఆ సమావేశం గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక విషయాలు చెప్పారు. అమిత్‌షా వారితో మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటివరకు ఐదు ప్రభుత్వాలను పడగొట్టాం.. ఇది ఆరో ప్రభుత్వం అని హామీ ఇచ్చినట్లు’ ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ విధంగా భాజపా కుట్రలకు పాల్పడుతోంది’’ అని గహ్లోత్ ఆరోపించారు.
కాగా సీఎం గహ్లోత్ చేసిన వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ.. ‘మీరు మీ పార్టీలో పరిస్థితులు మెరుగుపరచుకోకుండా.. ఇతరులపై ఆరోపణలు చేయడం సరైంది కాదు’ అని అన్నారు. ఈ ఏడాది జులైలో రాజస్థాన్‌లో సచిన్‌పైలట్ సహా పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌పై తిరుగుబాటు స్వరం వినిపించిన విషయం తెలిసిందే. పలు నాటకీయ పరిణామాల తర్వాత రాహుల్‌గాంధీతో సమావేశం అనంతరం వారంతా కాంగ్రెస్‌లోనే ఉంటున్నట్లు ప్రకటించడంతో ఉత్కంఠ వాతావరణానికి తెరపడింది.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.