వ్యవసాయ చట్టాల్ని పునఃపరిశీలించాలి: ప్రతిపక్షాలు

కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలపై పునఃపరిశీలన చేపట్టాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో మాయావతితో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు కేంద్రంపై విమర్శలు చేశారు.

Published : 30 Nov 2020 00:54 IST

దిల్లీ: కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలపై పునః పరిశీలన చేపట్టాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో మాయావతితో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు కేంద్రంపై విమర్శలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ.. ‘కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వారి నిరసనల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆ చట్టాలను పునఃపరిశీలిస్తే బాగుంటుంది’ అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చే ముందు మోదీజీ రైతు సంఘాలతో చర్చించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం తప్పక వెనక్కి తీసుకోవాలి. రైతులతో చర్చలు జరిపిన తర్వాత కేంద్రం వాటిని పునఃపరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాలి’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రైతు సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఒకవేళ రైతు సంఘాలు డిసెంబర్‌ 3కు ముందే చర్చలు జరపాలని కోరుకుంటే.. మీ నిరసనల్ని వీలైనంత తొందరగా ఓ నిర్ణీత ప్రదేశానికి తరలించండి. ఆ మరుసటి రోజే ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి చర్చలు జరుపుతుంది. అందుకు నేను భరోసా ఇస్తున్నా’ అని సింగ్‌ తెలిపారు. 

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ‘రైతుల్ని దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్న విధానం చూస్తుంటే.. వారు భారతీయులు కాదేమో అనే విధంగా ఉంది. రైతులతో పోలీసుల తీరు ఉగ్రవాదులతో వ్యవహరించినట్లు ఉంది. వారిని ఖలీస్థాన్‌కు చెందిన అవాంఛనీయ గ్రూపులతో పోల్చడమంటే రైతుల్ని అవమానించినట్లే’ అని రౌత్‌ మండిపడ్డారు. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చలో దిల్లీ ర్యాలీ ప్రారంభిచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వారితో చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ రైతులు అందుకు తిరస్కరించారు. మరోవైపు రైతుల్ని దిల్లీలోని బురారీ మైదానంలో నిరసన ప్రదర్శనలు చేసుకోవచ్చని చెప్పినప్పటికీ.. వారు సరిహద్దుల్లోనే ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తమకు నగర నడిబొడ్డున తమకు నిరసనలు చేసేందుకు అనుమతివ్వాలని రైతులు డిమాండు చేస్తున్నారు. చలో దిల్లీ నిరసనల్లో పాల్గొంటున్నవారిలో ముఖ్యంగా పంజాబ్‌, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా ఉన్నారు.  

తాజా చట్టాలతో రైతులకు మరిన్ని అవకాశాలు: మోదీ

కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల తిరస్కరణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు