భారత్‌ బంద్‌: రోడ్డెక్కిన రైతులు.. నిలిచిన రైళ్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు విస్తృతంగా మద్దతు లభిస్తోంది. అన్నదాతలకు మద్దతు ప్రకటించిన పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ

Updated : 08 Dec 2020 15:10 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు విస్తృతంగా మద్దతు లభిస్తోంది. అన్నదాతలకు మద్దతు ప్రకటించిన పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు నేడు బంద్‌లో పాల్గొన్నాయి. పలు రాష్ట్రాల్లో రైతులతో పాటు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 

దిల్లీ సరిహద్దుల్లో 13వ రోజు..

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హస్తిన సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 13వ రోజుకు చేరింది. దిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, ట్రికీ రహదారుల్లో వేలాది మంది బైఠాయించి శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. చట్టాలపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో మంగళవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింఘ, టిక్రీ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. భారీగా సాయుధ బలగాలు మోహరించారు. అన్నదాతల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. అయితే భాజపా పాలిత రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ ప్రభావం స్వల్పంగా కన్పిస్తోంది. రైతుల ఆందోళన దృష్ట్యా దిల్లీలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. 

రైళ్లను అడ్డుకుని.. 

భారత్‌ బంద్‌కు మద్దతుగా మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో రైతు సంఘాల సభ్యులు రైల్‌ రోకో చేపట్టారు. మల్కాపూర్‌ స్టేషన్‌లో చెన్నై-అహ్మదాబాద్‌ నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి పట్టాలపై నిరసనకు దిగారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు ఒడిశా రాష్ట్రంలోనూ రైతుల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో వామపక్షాలు, రైతు సంఘాల నేతలు రైళ్ల రాకపోకలను అడ్డగించారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతలు పట్టాలపై ఆందోళనకు దిగడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమబెంగాల్‌లోనూ వామపక్షాల నేతలు భారత్‌ బంద్‌ను మద్దతిస్తూ పలు రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 

పలు రాష్ట్రాల్లో భద్రత పెంపు..

మరోవైపు భారత్‌ బంద్‌ దృష్ట్యా కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతేగాక, ఆందోళనల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని సూచించింది. అటు రైల్వే సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. బంద్‌ దృష్ట్యా బిహార్‌లో భద్రతను పెంచారు. మహారాష్ట్రలోని పుణెలో పలు దుకాణాలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. ‘భారత్‌ బంద్‌ శాంతియుతంగా కొనసాగాలి. బంద్‌ కారణంగా ఎవరైనా ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుంటే వారికి నీళ్లు, పండ్లు ఇస్తాం’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ తెలిపారు. 

గుజరాత్‌లో ఉద్రిక్తంగా

కాగా.. భారత్‌ బంద్‌కు మద్దతుగా గుజరాత్‌లో చేపట్టిన ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. హైవేలపై నిరసనకు దిగిన ఆందోళనకారులు టైర్లను దహనం చేశారు. దీంతో ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు బంద్‌ దృష్ట్యా యూపీలోని లఖ్‌నవూలో కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. 

పుట్టినరోజు వేడుకలకు దూరంగా సోనియా

రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. డిసెంబరు 9న సోనియా పుట్టినరోజున ఎలాంటి వేడుకలు చేసుకోవట్లేదని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. నేటి భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..

రైతు భవిత పరాధీనం

ఒక్కటే ఎజెండా

మోదీజీ మీ పెద్ద మనసు చాటుకోండి: బాదల్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని