ప్రయాణాలకు దూరంగా ఉండండి: బైడెన్‌

అమెరికాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,39,21,374 మంది కరోనా బారిన పడగా.. 2,73,799 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలు సమీపిస్తుండటంతో మహమ్మారి మరింత విజృంభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అమెరికా..

Published : 03 Dec 2020 19:42 IST

వాషింగ్టన్‌:  అమెరికాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,39,21,374 మంది కరోనా బారిన పడగా.. 2,73,799 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలు సమీపిస్తుండటంతో మహమ్మారి మరింత విజృంభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ స్పందించారు. అత్యంత అవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు. వెల్లింగ్‌టన్‌లో ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఈ సారి క్రిస్మస్‌ వేడుకలు ఆర్బాటంగా జరుపుకోవడం కాస్త కష్టమే. ఈ విషయంలో మనం ఎవరినీ తప్పుబట్టలేం. పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాలి.’’ అని బైడెన్‌ అన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,50,000 మంది కరోనా మహమ్మారికి బలైనట్లు ఆయన తెలిపారు. ప్రజలు అశ్రద్ధగా వ్యవహరించినందువల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు శీతాకాలంలో వైరస్‌ విజృంభణ మరింత ఎక్కువగా ఉంటుందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ (సీడీసీ) హెచ్చరించిన విషయం తెలిసిందే. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న మూడు నెలల్లో మరో 2 లక్షల మరణాలు సంభవించే అవకాశముందని సీడీసీ డైరెక్టర్‌ రోబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ మీడియాతో చెప్పడం అమెరికాలో కరోనా విస్తృతికి అద్దం పడుతోంది. అమెరికాలో ఈ ఒక్క రోజే లక్ష మంది వివిధ ఆస్పత్రుల్లో చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కాలంలో అతి తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 

ఓ వైపు కరోనా విస్తృతి క్రమంగా తగ్గుతున్నప్పటికీ ప్రమాదం పొంచిఉందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని బైడెన్‌ కోరారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని అమెరికా ప్రజలకు సూచించారు. దేశంలోని 340 మిలియన్ల ప్రజలకు వ్యాక్సిన్‌ అందించేందుకు కృషి చేస్తామన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయని ఆయన తెలిపారు. ‘‘ నేను ఎప్పుడూ మాస్క్‌ ధరిస్తాను. మీరు కూడా ధరించండి. అది మీ జీవితాన్ని కాపాడుతుందని కచ్చితంగా చెప్పగలను. మాస్క్‌ ధరించడం వల్ల మీరే కాదు.. మీ చుట్టు పక్కల వారికీ ఉపయోగమే’’ అని బైడెన్‌ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని