
కంటతడి పెట్టిన బైడెన్
న్యూయార్క్: అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కంటతడి పెట్టారు. ఆరోగ్య సిబ్బందితో జరిగిన ఓ అన్లైన్ సమావేశం సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా విధుల్లో ఉన్న ఆ దేశ ఆరోగ్య సిబ్బంది తమ క్షేత్ర స్థాయి అనుభవాలను కాబోయే అధ్యక్షుడికి తెలియజేశారు. ఈ క్రమంలో మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్ అనే నర్స్.. మరణానికి చేరువలో ఉన్న కొవిడ్-19 బాధితులతో తన అనుభవాలను వివరించారు. కొవిడ్ బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించే వారని, వారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చానని మేరీ చెప్పారు. అది విన్న బైడెన్ ఒకింత భావోద్వాగానికి గురై కన్నీరు కార్చారు.
ప్రపంచంలోనే సంపన్న దేశాల్లో ఒకటైన అమెరికా కరోనా కారణంగా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. మాస్కులు అతి ముఖ్యమనే వైద్య నిపుణుల సూచలను కొట్టి పారేసిన డొనాల్డ్ ట్రంప్.. తమ దేశం ‘కింగ్ ఆఫ్ వెంటిలేటర్స్’ అని పదేపదే ప్రకటించారు. ఈ సమావేశం సందర్భంగా పలువురు నర్సులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బైడెన్‌కు వివరించారు. పీపీఈ కిట్ల కొరత వేధిస్తోందని తెలిపారు. రక్షణ కోసం తాము ప్లాస్టిక్ సంచులను వాడుతున్నామని కొందరు బైడెన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్- 95 మాస్కులను మళ్లీ మళ్లీ వాడడంలో అవి వదులై కింద పడిపోయిన సందర్బాలూ ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.