చిన్న తుంపర్లతోనే పెద్ద ముప్పు

కరోనా వైరస్‌ సంక్రమణపై జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి! బాధితుల ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఈ వైరస్‌ను మోసుకెళ్తుంటాయి. అయితే వివిధ పరిమాణాల్లోని తుంపర్ల కదలికలు..

Published : 06 Aug 2020 08:51 IST

వైద్యులకు కరోనా సోకడంలో వీటి పాత్రే ఎక్కువ!
అడ్డుకునేందుకు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు 

లండన్‌: కరోనా వైరస్‌ సంక్రమణపై జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి! బాధితుల ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఈ వైరస్‌ను మోసుకెళ్తుంటాయి. అయితే వివిధ పరిమాణాల్లోని తుంపర్ల కదలికలు ఎలా ఉంటాయన్న విషయాన్ని మరింత లోతుగా తెలుసుకునేందుకు... యూనివర్సిటీ ఆఫ్‌ ఈడెన్‌బర్గ్‌ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వ్యాపించే తీరును తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గణిత సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన ఈ కొత్త విధానాన్ని ‘ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌’ పత్రిక విశ్లేషించింది.

‘‘ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల పరిమాణం, వాటి ప్రయాణం మధ్య ఒకే విధమైన సంబంధం ఉండటం లేదు. మధ్యస్థాయి పరిమాణంలోని తుంపర్ల కంటే చిన్న, పెద్ద తుంపర్లే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. ఆరోగ్య సిబ్బంది ధరించే వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈలు) పెద్ద తుంపర్లను సమర్థంగా అడ్డుకోగలుగుతున్నాయి గానీ, చిన్న తుంపర్లను మాత్రం నిలువరించలేకపోతున్నాయి. ఈ కారణంగానే చాలామంది వైద్యులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. తుంపర్ల ప్రవర్తననూ, మేం రూపొందించిన కొత్త విధానాన్ని ఆధారం చేసుకుని... ఏరోసోల్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ అనే పరికరాన్ని రూపొందించాం. ఇది తలవెంట్రుక కంటే తక్కువ వ్యాసముండే తుంపర్ల నుంచి కూడా సమర్థంగా రక్షణ కల్పిస్తుంది. భవిష్యత్తులోనూ పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఇది దోహదపడుతుంది’’ అని పరిశోధనకర్త ఫెలిసిటీ మెహండాలే వివరించారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని