చైనా టీకాల సామర్థ్యంపై ఇంకా అనిశ్చితే!

ప్రపంచవ్యాప్తంగా ప్రయోగ దశలో ఉన్న టీకాలు ఇప్పటికే తమ వ్యాక్సిన్‌ సమర్థతలను వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ విషయంలో చైనా వ్యాక్సిన్‌ కంపెనీలు మాత్రం తమ గోప్యతను పాటిస్తున్నాయి.

Published : 25 Dec 2020 20:01 IST

బ్రెజిల్‌, టర్కీ దేశాలు ఏమన్నాయంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రయోగ దశలో ఉన్న టీకాలు ఇప్పటికే తమ వ్యాక్సిన్‌ సమర్థతలను వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ విషయంలో చైనా వ్యాక్సిన్‌ కంపెనీలు మాత్రం తమ గోప్యతను పాటిస్తున్నాయి. వ్యాక్సిన్‌ సమర్థంగానే పనిచేస్తోందని చెబుతున్నప్పటికీ వాటి ప్రయోగాల ఫలితాలను మాత్రం బయటకు వెల్లడించడం లేదు. దీంతో వాటి పనితీరుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.

చైనాకు చెందిన సినోవాక్‌ బయోటెక్‌ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు బ్రెజిల్‌, టర్కీ, ఇండోనేషియా, చిలీ దేశాల్లో జరుగుతున్నాయి. ప్రయోగాల్లో వీటి సామర్థ్యం దాదాపు 90శాతం ఉన్నట్లు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఉన్న సమచారాన్ని విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను వెల్లడించక పోవడంతో వ్యాక్సిన్‌ ఏ స్థాయిలో రక్షణ కల్పిస్తుందని తెలుసుకోవడంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రయోగాలు జరుగుతోన్న బ్రెజిల్‌, టర్కీ దేశాల అధికారులు మాత్రం చైనా వ్యాక్సిన్‌ పనితీరుపై తాజాగా స్పందించారు.

బ్రెజిల్‌లో 50శాతం, టర్కీలో 90శాతానికి పైగా..

బ్రెజిల్‌లో జరిపిన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సినోవాక్‌ వ్యాక్సిన్‌ కేవలం 50శాతానికిపైగా సమర్థంగా పనిచేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, ఇది 90శాతం సమర్థతను మాత్రం చేరుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ సమర్థత 60శాతమా, 70శాతమా, 80శాతమా అని కచ్చితంగా తెలియదని.. కానీ, కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో వ్యాక్సిన్‌ ప్రభావం కనిపిస్తున్నట్లు అక్కడి మీడియాకు బ్రెజిల్‌ అధికారి వెల్లడించారు. బ్రెజిల్‌లో దాదాపు 13వేల మంది వాలంటీర్లపై ప్రయోగాలు చేపట్టగా.. దాదాపు 170 కేసులను విశ్లేషించిన అనంతరం ఈ ఫలితం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక, తుది దశ ప్రయోగాలు జరుగుతోన్న టర్కీలో మాత్రం వ్యాక్సిన్‌ దాదాపు 91శాతం సమర్థత చూపించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కేవలం 29 కేసులను విశ్లేషించిన సమాచారం మాత్రమేనని.. ఈ ఫలితాన్నే తుది సమర్థతగా పరిగణించలేమని అభిప్రాయపడ్దారు. దీంతో వ్యాక్సిన్‌ పనితీరుపై ఇంకా స్పష్టత రాలేదు.

అధ్యక్షుడికి అనుమానమే..

వ్యాక్సిన్‌ను తయారు చేసిన చైనా కంపెనీ సినోవాక్‌ మాత్రం మౌనంగానే ఉండటం.. ప్రయోగ ఫలితాలను వెల్లడించడంలో ఆలస్యం చేస్తుండడంతో వ్యాక్సిన్‌ సామర్థ్యంపై సందిగ్ధత నెలకొంది. అంతేకాకుండా చైనా వ్యాక్సిన్‌ విషయంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో అసంతృప్తిగానే ఉన్నారు. చైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు, వాటి సమాచారంపై ఆది నుంచి ఆయన అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన క్రిస్మస్‌ వేడుకల ప్రసంగంలోనూ ఇదే అనుమానాన్ని మరోసారి వ్యక్తంచేసిన బోల్సోనారో.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు ఎదురైతే దానికి మేము(ప్రభుత్వం) బాధ్యులం కాదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు మాత్రం వ్యాక్సిన్‌ పంపిణీకే సిద్ధమయ్యారు.

ఇవీ చదవండి..

కొవిడ్‌19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!
చైనా వ్యాక్సిన్‌: సమర్థతపైగా గోప్యతే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని