బాబ్రీ కూల్చివేత కేసు: అడ్వాణీకి 100 ప్రశ్నలు!

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అడ్వాణీ వాంగ్మూలాన్ని......

Published : 24 Jul 2020 22:19 IST

దిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అడ్వాణీ వాంగ్మూలాన్ని లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన స్టేట్‌మెంట్‌ను కోర్టు నాలుగు గంటల పాటు రికార్డు చేసింది. ఈ రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో అడ్వాణీని దాదాపు 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.  ఈ విచారణలో తనపై వచ్చిన ఆరోపణలను అడ్వాణీ ఖండించారని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. 

ఈ కోర్టు విచారణ నేపథ్యంలో బుధవారం రోజున అడ్వాణీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇద్దరు నేతలూ దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు. 

1992 డిసెంబర్‌ 6న చోటుచేసుకున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణల ద్వారా పూర్తి చేసేందుకు సీబీఐ కోర్టు ప్రయత్నిస్తోంది. ఆగస్టు 31లోపు తీర్పు ఇవ్వాలని భావిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిన్న భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీ నుంచి వాంగ్మూలం రికార్డు చేసిన విషయం తెలిసిందే. మసీదు కూల్చివేత కేసులో 49 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేయగా, వారిలో 32 మంది సజీవంగా ఉన్నారు. వారందరి నుంచి సీఆర్‌పీసీలోని 313 సెక్షన్‌ కింద వాంగ్మూలాల నమోదు ప్రక్రియ జరుగుతోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని