CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు 

కరోనా వైరస్‌ విజృంభణతో దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను...

Updated : 01 Jun 2021 20:44 IST

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్‌ ఉద్ధృతితో విద్యార్థుల ఆరోగ్యంపై  తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉండటం సహజమేనన్న ప్రధాని.. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను బలవంత పెట్టొద్దని సూచించారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే.

విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని తెలిపారు. సాయంత్రం 5.30గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పరీక్షల నిర్వహణపైనే చర్చించారు. ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్రాల నుంచి సేకరించిన నివేదికలు, అభిప్రాయాలను అధికారులు ప్రధానికి వివరించారు. వీటిపైనే కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరీక్షలు మన యువతను ప్రమాదంలోకి నెట్టేందుకు కారణం కారాదని పేర్కొన్నారు. ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా విద్యార్థుల ఫలితాలను విడుదల చేసేందుకు సీబీఎస్‌ఈ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.  ఈ సమావేశంలో కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక, సమాచార, పెట్రోలియం, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రులతో పాటు కేబినెట్‌ కార్యదర్శి, పాఠశాల, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

పరీక్షల రద్దుకు సంబంధించి సీబీఎస్‌ఈ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 4న వాయిదా వేసిన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటన జారీచేసింది.  సీబీఎస్‌ఈ ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా ఇచ్చిన ఫలితాలతో సంతృప్తిచెందని విద్యార్థులకు కొవిడ్‌ సంక్షోభ పరిస్థితులు సద్దుమణిగాక పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. 

పెద్ద ఉపశమనం.. కేజ్రీవాల్‌ ట్వీట్‌

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయడంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హర్షం ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం గురించి అందరం చాలా ఆందోళన చెందామని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం ఇచ్చిందంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని