దిల్లీలో కొత్త సంవత్సర వేడుకలకు చెక్‌

కరోనా వైరస్‌ ప్రభావం, కొత్తరకం కేసులు కలవరపెడుతున్న వేళ దేశ రాజధానిలో నూతన సంవత్సర వేడుకలపై ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో దిల్లీ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ

Updated : 31 Dec 2020 10:44 IST

నేడు, రేపు రాత్రిపూట కర్ఫ్యూ

ముంబయిలోనూ ఆంక్షలు

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం, కొత్తరకం కేసులు కలవరపెడుతున్న వేళ దేశ రాజధానిలో నూతన సంవత్సర వేడుకలపై ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో దిల్లీ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. నేడు, రేపు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు దిల్లీ చీఫ్‌ సెక్రటరీ విజయ్‌ దేవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇక రాత్రి 8 గంటల తర్వాత ఇండియా గేట్‌, రాజ్‌పథ్‌, విజయ్‌ చౌక్‌, పార్లమెంట్‌ పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరించింది. కన్నౌట్‌ ప్లేస్‌, మార్కెట్‌ ప్రాంతాల్లో కూడా ఆంక్షలు విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. అయితే, రాత్రి కర్ఫ్యూ ఉన్నప్పటికీ అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పోలీసులు వెల్లడించారు. 

ముంబయిలోనూ..

అటు దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని కొత్త సంవత్సర వేడుకలకు చెక్‌ పడింది. ముంబయిలో నేటి రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు ముంబయి పోలీసు విభాగ అధికార ప్రతినిధి చైతన్య వెల్లడించారు. రెస్టారంట్లు, పబ్‌లు, బార్లు, బీచ్‌ల్లో ఎలాంటి పార్టీలకు అనుమతి లేదని తెలిపారు. నగర వ్యాప్తంగా డ్రోన్లతో నిఘా పెట్టినట్లు చెప్పారు. 

నూతన సంవత్సరం నేపథ్యంలో కరోనా వ్యాప్తిని పెంచే సామూహిక సమావేశాలు, సంబరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ బుధవారం అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. అధిక సంఖ్యలో జనం గుమిగూడటాన్ని నివారించాలని, స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో దిల్లీ, ముంబయిల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

ఇవీ చదవండి..

కొత్త సంవత్సరం వేడుకలపై నిఘా

20కి చేరిన కొత్త వైరస్‌ కేసులు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని