మరికొన్ని వారాల్లో భారత్‌లో టీకా: మోదీ

కొవిడ్‌ కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభవార్త చెప్పారు. కొద్ది వారాల్లో భారత్‌లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు

Updated : 04 Dec 2020 16:01 IST

రాష్ట్రాలతో చర్చ తర్వాతే వ్యాక్సిన్‌ ధరపై నిర్ణయం

దిల్లీ: కొవిడ్‌ కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభవార్త చెప్పారు. కొద్ది వారాల్లో భారత్‌లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యం కింద ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు అందిస్తామని చెప్పారు. కాగా.. టీకా ధరపై రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని వెల్లడించారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరిస్థితి, వ్యాక్సిన్‌ పురోగతి, టీకా పంపిణీ తదితర అంశాలను కేంద్రం అఖిల పక్షాలకు వివరించింది. 

ప్రపంచ దేశాల చూపు భారత్‌వైపు..

‘‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని మన శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారన్నారు. భద్రమైన, చవకైన టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని.. అందుకే ఇప్పుడు ప్రపంచదేశాల చూపు అంతా భారత్‌పైనే ఉంది’’ అని మోదీ తెలిపారు.

వృద్ధులకు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యం

‘‘మరికొద్ది వారాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. టీకాను ఆమోదించిన తక్షణమే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుపెడతాం. ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు వ్యాక్సినేషన్‌లో తొలి ప్రాధాన్యం కల్పిస్తాం’’ అని మోదీ తెలిపారు. కాగా.. టీకా ధరలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మోదీ చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. 

పంపిణీలో మనం భేష్‌..

టీకా పంపిణీలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని మోదీ తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియాలో భారత్‌ సమర్థంగా, పారదర్శకంగా ఉందని చెప్పారు. టీకా పంపిణీ కోసం మనకు పెద్ద, అనుభవజ్ఞ నెట్‌వర్క్‌ ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ విధానంపై సలహాలు, సూచనలను లిఖితపూర్వకంగా పంపించాలని, వాటిని పరిగణనలోకి తీసుకుంటానమి మోదీ ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలను కోరారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వదంతులను అరికట్టి.. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మోదీ గుర్తుచేశారు.

ఇవీ చదవండి.. 

టీకా.. అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్‌!

మోడెర్నా యాంటీబాడీల జీవితకాలం 3 నెలలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని