కరోనా ‘మహా’ఉగ్రరూపం: ఒక్కరోజులో 16వేలకు పైనే..

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లోనే 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి . తాజాగా 16,867 కొత్త పాజిటివ్‌ కేసులు.......

Published : 29 Aug 2020 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా 16,867 కొత్త పాజిటివ్‌ కేసులు, 328 మరణాలు నమోదు కాగా..  11,541 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,64,281కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 5,54,711 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 24,103 మంది మరణించారు. ప్రస్తుతం 1,85,131 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 72.58శాతం ఉండగా.. మరణాల రేటు 3.15శాతంగా ఉంది. ఇప్పటివరకు 40,10,200 శాంపిల్స్‌ను పరీక్షించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.5శాతంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

దిల్లీలో పెరుగుతున్న ఉద్ధృతి

దిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఈ రోజు కొత్తగా 1945 కేసులు; 15 మరణాలు నమోదయ్యాయి. 24గంటల్లో దాదాపు 22వేల మందికి పైగా పరీక్షలు చేసినట్టు దిల్లీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దిల్లీలో ఇప్పటి వరకు 15,48,659 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,71,366 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 1,52,922 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 4,404 మంది మృతిచెందారు. ప్రస్తుతం 14,040 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24గంటల్లో 1449 మంది కోలుకున్నారు. 

తమిళనాట రికవరీ రేటు 85.45%

తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు కొత్తగా 6,352 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,15,590కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 6,045 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జిల సంఖ్య 3,55,727కి పెరిగింది. తాజాగా 80,988 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయడంతో మొత్తం టెస్టుల సంఖ్య 46,54,797కి పెరిగింది. తాజాగా మరో 87మంది మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 7,137కి పెరిగింది. రాష్ట్రంలో రికవరీ రేటు 85.45శాతంగా ఉన్నట్టు సీఎం పళనిస్వామి వెల్లడించారు. మరణాల రేటు 1.7శాతంగా ఉందన్నారు. ఈ రోజు ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ చర్యల నిమిత్తం ఇప్పటిదాకా రూ.7,162 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని