అందుకే దీదీ కేంద్ర పథకాల్ని అనుమతించట్లేదు: షా

పశ్చిమ బెంగాల్‌(షోనార్‌ బంగ్లా) కలల్ని సాకారం చేసేందుకు భాజపా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆ రాష్ట్ర ప్రజల్ని కోరారు. రెండు రోజుల బెంగాల్‌ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆయన కోల్‌కతాకు చేరుకున్నారు.

Published : 05 Nov 2020 18:50 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (షోనార్‌ బంగ్లా) కలల్ని సాకారం చేసేందుకు భాజపా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆ రాష్ట్ర ప్రజల్ని కోరారు. రెండు రోజుల బెంగాల్‌ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆయన కోల్‌కతాకు చేరుకున్నారు. బంకురా జిల్లాలో  విప్లవకారుడు బిర్సా ముండా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో భాజపా కార్యకర్తలపై దాడులు, కేంద్ర పథకాలు అనుమతించకపోవడాన్ని ఉద్దేశిస్తూ మమతా ప్రభుత్వంపై షా విరుచుకుపడ్డారు. ‘గత రాత్రి నేను బెంగాల్‌కు వచ్చాను. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఇక్కడి ప్రజల ఆగ్రహావేశాలను నేను గ్రహించగలిగాను. అదేవిధంగా తమ రాష్ట్రం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే మార్పు కాగలదని భావిస్తున్న ఇక్కడి ప్రజల ఆకాంక్షను కూడా గుర్తించాను’ అని షా తెలిపారు.  

‘మమతా బెనర్జీ హయాంలో భాజపా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. బెంగాల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా  మెజారిటీతో విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ సహా 80 పథకాలు బెంగాల్‌లోని పేద ప్రజలకు అందడం లేదు. మమతా ప్రభుత్వమే కేంద్ర పథకాలను రాష్ట్రంలోని పేదలకు అందనివ్వడం లేదు. ఎందుకంటే కేంద్ర పథకాలను ప్రజలకు చేర్చకుండా ఆపడం ద్వారా భాజపాను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయొచ్చు అని దీదీ భావిస్తున్నారు. కానీ చెప్పేదొకటే.. ఆమె ఆ పథకాల్ని అనుమతిస్తే.. పేదలు కూడా ఆమె ప్రభుత్వంపై ఆలోచిస్తారు’ అని అమిత్‌ షా టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదేవిధంగా బంకురా సరిహద్దు జిల్లా కావడంతో సీఆర్పీఎఫ్‌ సీనియర్‌ అధికారులతో భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా 2021లో పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని