
శీతాకాలంలో మరోసారి కరోనా విజృంభణ!
పరిశోధనలు జరుపుతున్నామన్న నీతి ఆయోగ్ సభ్యుడు
దిల్లీ: రానున్న శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నీతి ఆయోగ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ రానున్న శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలను కొట్టివేయలేమన్నారు. కరోనా కట్టడి చర్యల సమన్వయ బృందానికి నేతృత్వం వహిస్తున్న వీకే పాల్ న్యూస్ ఏజెన్సీ పీటీఐతో ఆదివారం మాట్లాడారు. యూరోప్‌లో తిరగబెడుతున్న కేసులను గుర్తుచేస్తూ శీతాకాలంలో భారత్‌లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్‌లో అలా జరిగే అవకాశాలు ఉన్నాయని, దీనిపై మరింత పరిశోధనలు జరుపుతున్నామని వెల్లడించారు. దేశం ప్రస్తుతం మెరుగైన స్థితిలోనే ఉందని, కానీ ఇంకా అనేక అవరోధాలను దాటాల్సి ఉందన్నారు.
కరోనా టీకా మార్కెట్‌లోకి వస్తే దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు తగినన్ని వనరులు ఉన్నాయని వీకే పాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో సరిపడా శీతల గిడ్డంగులు ఉన్నాయని, ఇంకా కావాల్సి వస్తే వాటిని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. గిడ్డంగుల గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
దేశంలో నిత్యం కొత్త కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 61,871 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో కేసుల సంఖ్య 7,494,551కు చేరింది. ఆదివారం 1,033 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 114,031కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసుల్లో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. అమెరికా మొదటిస్థానంలో కొనసాగుతోంది.