అప్పడాలతో కరోనా కట్టడి: కేంద్ర మంత్రి

దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో అప్పడాలతో కరోనాను కట్టడి చేయవచ్చని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి...

Published : 24 Jul 2020 20:40 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో అప్పడాలతో కరోనాను కట్టడి చేయవచ్చని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ వీడియోలో మాట్లాడుతూ ‘‘ బికనీర్‌కు చెందిన అప్పడాలు తయారు చేసే సంస్థ ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా భాభీజీ పేరుతో అప్పడాలను తయారు చేశారు. వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలు మన శరీరంలో కరోనా వైరస్‌పై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు సహాయపడతాయి. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా ఇలాంటి ఒక ఉత్పత్తిని తయారుచేసిన సదరు సంస్థను అభినందిస్తున్నాను’’ అని వీడియోలో పేర్కొన్నారు.

ఈ వీడియోను కాంగ్రెస్‌ నేత హితేంద్ర పిథాడియా తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ‘‘దిల్లీ, రాజస్థాన్‌ పోలీసులు ఈ వీడియోను సుమోటోగా తీసుకుని అసత్యమైన, అశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌పై  చర్యలు తీసుకోవాలి’’ అని ట్వీట్‌లో కోరారు. హితేంద్ర ఈ వీడియో షేర్‌ చేసిన కొద్ది సేపటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచ దేశాలు మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి’ అంటూ కామెంట్ చేశారు. అలానే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ కూడా కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని