కరోనాకు కళ్లెం.. కేంద్రం కొత్త నిబంధనలు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్‌ 1నుంచి 31 వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కొవిడ్‌ నిబంధనలను బుధవారం ప్రకటించింది.......

Updated : 25 Nov 2020 18:06 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కొవిడ్‌ నిబంధనలను బుధవారం ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు పెరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో దృష్టి కేంద్రీకరించి వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల లాక్‌డౌన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి అని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఈ బాధ్యత పోలీసులు, జిల్లా యాంత్రాంగానిదేనని స్పష్టంచేసింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ వంటి నిబంధనలు రాష్ట్రాలు విధించుకొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. 

పాజిటివ్‌వస్తే 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి

‘‘కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సూక్ష్మస్థాయిలో కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేయాలి. ఆయా జోనన్ల వివరాలు జిల్లా కలెక్టర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ఆ సమాచారాన్ని కేంద్ర వైద్యశాఖకు అందించాలి. రోజువారీ అవసరాలు మినహా కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రజలు తిరగకుండా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలి. ఎవరికైనా పాజిటివ్ వస్తే 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి. జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు కరోనా నియంత్రణ చర్యల అమలును పర్యవేక్షించాలి. ఆయా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంచాలి’’ అని కేంద్రం సూచించింది.

ఈ మూడింటిపై నిషేధం కొనసాగింపు

‘‘అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, ఎగ్జిబిషన్‌ హాళ్లపై నిషేధం కొనసాగుతుంది. సామాజిక, మతపరమైన, సాంస్కృతిక కేంద్రాలు, సినిమా థియేటర్లలో 50శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. వీటిపైనా పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది’’ అని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.

మాస్క్‌లు ధరించకపోతే జరిమానా!

కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులలో తప్ప మిగతా సమయంలో కఠిన నిబంధనలు అమలుచేయాలని కేంద్రం సూచించింది. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాలని సూచించింది. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి తగిన జరిమానా విధించే అవకాశాన్ని రాష్ట్రాలు పరిశీలించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని