రేప్‌ కేసుల్లో FIR తప్పనిసరి: 60రోజుల్లో దర్యాప్తు

ఆడపిల్లలపై నానాటికీ పెరుగుతున్న దారుణాలు, హాథ్రస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై కేంద్రం మరోసారి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై నేరాలు ముఖ్యంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది

Updated : 10 Oct 2020 14:35 IST

‘హాథ్రస్‌’ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

దిల్లీ: ఆడపిల్లలపై నానాటికీ పెరుగుతున్న దారుణాలు, హాథ్రస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై కేంద్రం మరోసారి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై నేరాలు ముఖ్యంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లైంగిక దాడుల కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు తప్పనిసరి అని, అంతేగాక ఈ కేసుల్లో 60రోజుల్లోగా పోలీసులు దర్యాప్తు పూర్తి చేయాలని సూచించింది. ఈ నిబంధనలకు పోలీసులు కట్టుబడి ఉండాలని లేని పక్షంలో బాధితులకు సరైన న్యాయం చేయలేమని పేర్కొంది. నిబంధనలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయని గుర్తుచేసింది. ఈ మేరకు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని చట్టాలను గుర్తుచేస్తూ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. 

కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో కొన్ని..

* మహిళలపై లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఒకవేళ నేరం పోలీస్‌స్టేషన్‌ పరిధి వెలుపల జరిగిన పక్షంలో ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే సదరు అధికారి శిక్షార్హుడే. 

* అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60రోజుల్లోగా పూర్తవ్వాలి. దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చింది. 

లైంగికదాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించాలి.

న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి. దాన్ని విస్మరించకూడదు.

లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్‌ అసల్ట్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్లను ఉపయోగించాలి. 

* పోలీసులు నిబంధనలకు పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని